హీరోయిన్‌ను గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు!

28 Jan, 2020 16:03 IST|Sakshi

పాత వీడియో షేర్‌ చేసిన సారా అలీఖాన్‌

కేదార్‌నాథ్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన స్టార్‌ కిడ్‌ సారా అలీఖాన్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి నటించిన సింబా చిత్రం హిట్‌గా నిలవడంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌తో కలిసి లవ్‌ ఆజ్‌కల్‌ సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆమె తండ్రి సైఫ్‌ అలీఖాన్‌ నటించిన లవ్‌ ఆజ్‌కల్‌కు సీక్వెల్‌ కావడం విశేషం. ఇక సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే సారా.. తాజాగా షేర్‌ చేసిన తన పాత వీడియో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అమెరికాలో చదువుకున్న రోజుల్లో సారా దాదాపు 96 కిలోల బరువుతో బొద్దుగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి పీసీవోడీతో బాధపడుతున్న కారణంగా వేగంగా బరువు పెరిగానని గతంలో ఆమె వెల్లడించారు. 

కాగా కొలంబియా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న సమయంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని భావించిన సారా... తల్లి అమృతా సింగ్‌ సూచన మేరకు నాజూగ్గా తయారయ్యారు. ఇందుకోసం జిమ్‌లో తీవ్రంగా శ్రమించారు. అనంతరం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నారు. అధిక బరువుతో ఉన్ననాటి పాత వీడియోను సారా తాజాగా షేర్‌ చేశారు. తన ప్రస్తుత రూపానికి కారణం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నమ్రతా పురోహిత్‌ అని పేర్కొన్నారు. కాగా ఈ వీడియోను ఇప్పటికే 40 లక్షలకు మందికి పైగా వీక్షించగా.. తొమ్మిదిన్నర లక్షల మంది లైక్‌ కొట్టారు. దీంతో సారా పోస్టు వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో.. ‘స్నేహితులను సరదాగా ఆటపట్టిస్తున్న సారాను అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం.. ఇంత మార్పు ఎలా సాధ్యం’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా