‘శరభ’ మూవీ రివ్యూ

22 Nov, 2018 13:13 IST|Sakshi

టైటిల్ : శరభ
జానర్ : సోషియో ఫాంటసీ
తారాగణం : ఆకాష్‌ కుమార్‌, మిస్తీ చక్రవర్తి, జయప్రధ, నెపోలియన్‌, పొన్‌వన్నన్‌
సంగీతం : కోటి
దర్శకత్వం : ఎన్‌. నరసింహారావు
నిర్మాత : అశ్వనీ కుమార్‌ సహదేవ్‌

ఒకప్పుడు టాలీవుడ్‌లో సోషియో ఫాంటసీల ట్రెండ్‌ బాగా కనిపించేది. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు పెద్దగా రాలేదు. దీంతో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన శరభ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జయప్రధ లాంటి సీనియర్‌ నటి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం కూడా శరభకు కలిసొచ్చింది. మరి ఆ అంచనాలను శరభ అందుకుందా..? ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్‌ కుమార్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? జయప్రధ రీ ఎంట్రీలో సత్తా చాటారా..?

కథ ;
శరభ (ఆకాష్‌ కుమార్‌) సిరిగిరిపురంలో సరదాగా కాలం వెల్లదీసే అల్లరి కుర్రాడు. కొడుకే ప్రాణంగా బతికే పార్వతమ్మ (జయప్రధ) ఎన్ని తప్పులు చేసినా శరభను ఒక్క మాట కూడా అనదు. దివ్య (మిస్తీ చక్రవర్తి) సెంట్రల్‌ మినిస్టర్(షియాజీ షిండే) కూతురు. తన జాతక దోశాలకు సంబంధించిన శాంతి కోసం మినిస్టర్‌ తన కూతురిని సిరిగిరిపురంలోని గురువు (పొన్‌వన్నన్‌) గారి దగ్గర విడిపెట్టి వెళతాడు. గురువుగారు దివ్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతను శరభ, పార్వతమ్మలకు అప్పగిస్తాడు. చిన్న గొడవతో ప్రారంభమైన దివ్య, శరభల పరిచయం తరువాత ప్రేమగా మారుతుంది. అదే సమయంలో దివ్య ప్రమాదంలో ఉందని తెలుస్తోంది. 17 మంది అమ్మాయిలను బలి ఇచ్చిన ఓ రాక్షసుడు 18వ బలి కోసం దివ్యను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే సమయంలో శరభ గతానికి సంబంధించిన ఓ విషయం తెలుస్తుంది. అసలు శరభ గతం ఏంటి..? ఆ రాక్షసుడు దివ్యను ఎందుకు బలి ఇవ్వాలనుకున్నాడు..?  రాక్షసుడితో శరభ చేసే పోరాటంలో దైవ శక్తి ఎలా సహాయపడింది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హీరో ఆకాష్‌ కుమార్‌ మెప్పించలేకపోయాడు. యాక్షన్ సీన్స్‌లో పరవాలేదనిపంచినా నటన పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్‌ అవ్వాలి. హీరోయిన్‌ మిస్తీ చక్రవర్తి తన పరిధి మేరకు పరవాలేదనిపించింది. ఇక పార్వతమ్మ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చిన జయప్రధ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. హీరో తల్లిగా హుందాగా కనిపించారు. చాల కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన పునీత్‌ ఇస్సార్‌, నెపోలియన్లను తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇతర పాత్రల్లో నాజర్‌, పొన్‌వన్నన్‌, చరణ్ దీప్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ ;
చాలా కాలం తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ సోషియో ఫాంటసీ కథను తీసుకువచ్చిన దర్శకుడు ఎన్‌ నరసింహారావు మెప్పించలేకపోయారు. సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో ప్రారంభించినా.. తొలి భాగం అంతా టైంపాస్‌ సన్నివేశాలతో లాగించేశారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లు మధ్య వచ్చే సన్నివేశాలు బోర్‌కొట్టిస్తాయి. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మేకప్‌, గ్రాఫిక్స్‌ కీలకం. కానీ ఆ రెండు విషయాల్లో శరభ నిరాశపరుస్తుంది. క్లైమాక్స్‌లో నరసింహా స్వామి స్వయంగా వచ్చి రాక్షసున్ని అంతం చేసే సీన్‌ బాగుంది. సంగీతం కూడా ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
జయప్రధ
సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
కథనం
ఫస్ట్‌ హాఫ్‌
సంగీతం

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

Poll
Loading...
మరిన్ని వార్తలు