అతనితో నయన సై అంటుందా?

16 Apr, 2017 11:33 IST|Sakshi
అతనితో నయన సై అంటుందా?

నేటి హీరోయిన్లు కథకు ప్రాముఖ్యత, పాత్రల్లో నటనకు అవకాశం ఉండాలి అని పైకి చెప్పినా పారితోషికానికి ప్రాధాన్యంఇస్తారన్నది చాలా సార్లు రుజువైంది. అవును డబ్బే ముఖ్యం అని కొందరు బహిరంగంగానే అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. వర్ధమాన నటి కీర్తీసురేశ్‌ అతి కొద్ది కాలంలోనే మూడు కోట్లు పారితోషికం డిమాండ్‌ చేస్తోందన్న వార్తలు వింటున్నాం. ఇందంతా ఎందుకు చెప్పాల్సొస్తోందంటే, ప్రస్తుతం లేడీసూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నటి నయనతారతోనే కథానాయకుడిగా తన తొలి చిత్రం ఉంటుందని ఒక యువ వ్యాపారవేత్త వెల్లడించారు.

చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార టాప్‌ హీరోలతో పాటు, యువ స్టార్‌ హీరోలతోనూ, వర్ధమాన హీరోలతోనూ నటించడానికి సై అంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ యువ వ్యాపారవేత్త కలను నిజం చేస్తారా? ఇంతకీ ఈ వ్యాపారవేత్త ఎవరన్నది చెప్పలేదు కదూ‘ప్రముఖ వాణిజ్య సంస్థ శరవణ స్టోర్స్‌ అధినేత శరవణన్‌ ఆ మధ్య తన సంస్థ ప్రమోషన్‌ కోసం రూపొందించిన వాణిజ్య ప్రకటనలో ప్రముఖ నటీమణులు తమన్నా, హన్సికలతో కలిసి నటించారు.

ఆయనకిప్పుడు సినిమా ఆశపుట్టిందట. తను కథానాయకుడిగా నటించే తొలి చిత్రంలో నయనతారనే నాయకి అవుతుందని ఆయనే స్వయంగా వెల్లడించారు. మరి ఈ విషయం నయనతార చెవిన పడిందా?ఆయనతో నటించడానికి  ఈ బ్యూటీ సై అంటుందా? ఎస్‌ అంటే ఎంత పారితోషకం డిమాండ్‌ చేస్తారు? ఈ వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇప్పటికే ఈ అమ్మడు నాలుగు కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు సినీ వర్గాల టాక్‌.