పండగ వచ్చేసింది!

10 Jan, 2016 23:09 IST|Sakshi
పండగ వచ్చేసింది!

జనరల్‌గా హీరోలు బైక్ మీద వెళితే.. కమెడియన్లు వెనకాల కూర్చుంటారు. కమెడియన్ బైక్ నడిపితే, హీరో అతని భుజాల మీద కూర్చునే తరహా సీన్స్ దాదాపు కనిపించవు. అందుకే, బైక్ నడుపుతున్న అలీ భుజాల మీద పవన్ కల్యాణ్ కూర్చోవడం, పక్కనే బ్రహ్మాజీ, నర్రా శ్రీను  నిలబడి చిరునవ్వులు చిందిస్తూ పోజివ్వడం చూస్తుంటే వింతగానే ఉంటుంది. సినిమాలో కొత్త కొత్త కామెడీ ట్విస్టులు చాలా ఉంటాయనడానికి ఈ స్టిల్‌ని శాంపుల్‌గా చిత్రనిర్మాత శరత్ మరార్ బయటపెట్టి ఉంటారు.
 
  బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’కి సంబంధించిన ఈ స్టిల్‌ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ స్టిల్ అభిమానులను అలరిస్తుందని ఊహించవచ్చు. మరో రెండు రోజుల్లో రానున్న సంక్రాంతి పండగ ఇప్పుడే వచ్చేసినట్లుగా ఫ్యాన్స్ భావించినా ఆశ్చర్యపోవడానికి లేదు. హైదరాబాద్‌లోని సుమారు 5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందించిన సెట్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి పవన్‌కల్యాణ్ కథ-స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.