సంక్రాంతి వార్‌: మారిన స్టార్‌ హీరోల రిలీజ్‌ డేట్స్‌

7 Nov, 2019 13:43 IST|Sakshi

హైదరాబాద్‌ : స్టార్‌ హీరోల సినిమాలను సంక్రాంతి సీజన్‌లో రిలీజ్‌ చేసి వీలైనంత సొమ్ము చేసుకోవాలని అగ్ర నిర్మాతలు పోటీ పడుతుంటారు. సంక్రాంతికి రెండు, మూడు సినిమాలు పోటాపోటీగా రిలీజైనా అన్ని సినిమాలు మెరుగైన వసూళ్లు సాధించే స్పేస్‌ ఉంటుందని చెబుతారు. అయితే ఒకే రోజు ఇద్దరు అగ్రహీరోలు నటించిన సినిమాలు విడుదలైతే మాత్రం అది ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతుందని, లాంగ్‌రన్‌లోనూ వసూళ్లు ఎఫెక్ట్‌ అవుతాయనే ఆందోళనా వ్యక్తమవుతుంది. రానున్న సంక్రాంతికి ప్రిన్స్‌ మహేష్‌ సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో జనవరి 12న రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేశాయి. బన్నీ, ప్రిన్స్‌ల బాక్సాఫీస్‌ క్లాష్‌పై బయ్యర్లతో పాటు ఫ్యాన్స్‌లోనూ ఆందోళన రేకెత్తడంతో విడుదల తేదీలపై నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు.

ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఓపెనింగ్స్‌తో పాటు నెగెటివ్‌, మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చిన సినిమా వసూళ్లు దెబ్బతింటాయనే భయం వెంటాడుతోంది. భారీ మొత్తాలు వెచ్చించి సినిమాలను కొనుగోలు చేసే బయ్యర్లకు అంత భారీ మొత్తం రికవర్‌ కావాలంటే రెండు సినిమాల మధ్య గ్యాప్‌ ఉండాలని భావిస్తున్నారు. విడుదల తేదీ వివాదంపై ఇటీవల సమావేశమైన ఇరువురు నిర్మాతలు చర్చించి రిలీజ్‌ డేట్స్‌ను మార్చినట్టు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం అల వైకుంఠపురములో, సరిలేరునీకెవ్వరూ చిత్రాలు వరుసగా జనవరి 11, 13 తేదీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. విడుదల తేదీలపై ఆయా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రెండు భారీ చిత్రాలు ఒకేరోజు తలపడకుండా రెండు రోజుల గ్యాప్‌తో రానుండటంతో ఇరు సినిమాలు భారీ వసూళ్లను కొల్లగొడతాయని మేకర్లు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు