వందకోట్ల క్లబ్బులో సరిలేరు

14 Jan, 2020 16:17 IST|Sakshi

హైదరాబాద్‌: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’  బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా తొలి మూడురోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను దాటేసింది. బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌గా బాక్సాఫీస్‌ వద్ద హల్‌చల్‌ చేస్తున్న ఈ సినిమా మూడు రోజుల్లో 103 కోట్ల రియల్‌ గ్రాస్‌ వసూలు చేసిందని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మహేశ్‌బాబుతో కూడిన సరిలేరు నీకెవ్వరు పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండోరోజు శనివారం సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలిమూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్‌ వెల్లడించింది.

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పెద్దగా కథ లేకపోయినా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అంశాలపై దర్శకుడు అనిల్‌ బాగా ఫోకస్‌ చేశాడని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌లో బాక్సాఫీస్‌ వద్ద ‘సరిలేరు నీకెవ్వరు’ భారీగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రెడ్‌ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా