‘సర్కార్‌’ మూవీ రివ్యూ

6 Nov, 2018 12:33 IST|Sakshi

టైటిల్ : సర్కార్‌
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : విజయ్‌, కీర్తీ సురేష్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, యోగిబాబు
సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌
దర్శకత్వం : ఏఆర్‌ మురుగదాస్‌
నిర్మాత : కళానిధి మారన్‌

కోలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న విజయ్‌ తెలుగులో మాత్రం ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. సూర్య, విశాల్‌, కార్తీ లాంటి హీరోలు తెలుగునాట కూడా మంచి మార్కెట్ సాధించినా విజయ్ మాత్రం ఇంత వరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. తుపాకి, అదిరింది లాంటి సినిమాలు టాలీవుడ్‌లో పరవాలేదనిపించినా విజయ్‌ స్థాయి సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోయాయి. తాజాగా మరోసారి మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్‌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్‌. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సర్కార్‌ అందుకుందా..? ఈ సినిమాతో అయినా విజయ్‌ తెలుగు మార్కెట్‌లో జెండా పాతాడా..? స్పైడర్‌ సినిమాతో టాలీవుడ్‌కు షాక్‌ ఇచ్చిన దర్శకుడు మురుగదాస్‌, సర్కార్‌తో ఆకట్టుకున్నాడా..?

కథ ;
సుందర్‌ రామస్వామి (విజయ్‌) సంవత్సరానికి 1800 కోట్లు సంపాదించే బిజినెస్‌మేన్‌. తను ఏ దేశంలో అడుగుపెట్టిన అక్కడి కంపెనీలను దెబ్బతీసి, వాటిని మూసేయించే కార్పోరేట్‌ క్రిమినల్‌. అలాంటి సుందర్‌ భారత్‌కు వస్తుండన్నా సమాచారంతో ఇక్కడి కార్పోరేట్ కంపెనీలన్ని ఉలిక్కి పడతాయి. కానీ ఇండియా వచ్చిన సుందర్‌ కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోవడానికే వచ్చానని చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు.

ఓటు వేయడానికి వెళ్లిన సుందర్‌కు తన ఓటును ఎవరో దొంగ ఓటు వేశారని తెలుస్తుంది. దీంతో తన ఓటు కోసం కోర్టును ఆశ్రయిస్తాడు. సుందర్‌ ఓటు హక్కు వినియోగించుకునే వరకు అక్కడ ఎలక్షన్‌ కౌంటింగ్ ఆగిపోతుంది. సుందర్‌ విషయం తెలిసి ఓటు వేయలేకపోయిన దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజులు అదే తరహాలో కేసుల వేస్తారు. దీంతో ఎలక్షన్‌లను రద్దు చేసి తిరిగి 15 రోజుల్లో ఎన్నికల నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తుంది. తరువాత అధికారి పార్టీ నేతలతో గొడవల కారణంగా సుందర్‌ స్వయంగా ఎలక్షన్‌లలో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. కార్పోరేట్ క్రిమినల్‌గా పేరు తెచ్చుకున్న సుందర్‌ ఇక్కడి కరుడు గట్టిన రాజకీయనాయకులతోఎలా పోరాడాడు? పోటికి దిగిన సుందర్‌కు ఎదురైన సమస్యలేంటి.? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ మరోసారి సూపర్బ్‌ యాక్టింగ్‌ తో ఆకట్టుకున్నాడు. గతంలో ఎన్నడూ కనిపించనంత స్టైలిష్ లుక్‌ లో కనిపించిన విజయ్‌, అభిమానులు తన నుంచి ఆశించే అని అంశాలను తెరపై చూపించాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లో విజయ్‌ పర్ఫామెన్స్‌ సూపర్బ్‌. మహానటిగా పేరు తెచ్చుకుంటున్న కీర్తి సురేష్‌కు ఈ సినిమాలో ఏమాత్రం ప్రాదాన్యం లేని పాత్రలో కనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఒకటి రెండు సన్నివేశాలు తప్ప కీర్తి సురేష్ ఎక్కడా పెద్దగా కనిపించదు. మరో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ది కూడా చిన్న పాత్రే. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. రాజకీయ నాయకుడి పాత్రలో రాధారవి మరోసారి తన అనుభవాన్ని చూపించారు. సీఎం పుణ్యమూర్తిగా కనిపించిన కరుప్పయ్య కూడా ఆ పాత్రకు సరిగ్గా సరిపోయారు. ఇతర పాత్రల్లో కనిపించిన వారంతా తమిళ వారే కావటంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే.

విశ్లేషణ ;
కత్తి, తుపాకి లాంటి బ్లాక్‌బస్టర్స్‌ అందించిన కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావటంతో సర్కార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సారి మురుగదాస్‌, విజయ్‌లు ఆ స్థాయిలో అలరించలేకపోయారు. విజయ్‌ మార్క్‌ స్టైల్స్‌, మాస్‌ అప్పీల్ కనిపించినా.. మురుగదాస్‌ గత చిత్రాల్లో కనిపించి వేగం ఈ సినిమాలో లోపించినట్టుగా అనిపిస్తుంది. ఓ కార్పోరేట్ క్రిమినల్‌, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు అన్న ఇంట్రస్టింగ్ పాయింట్‌ను తీసుకున్న దర్శకుడు కథనాన్ని చాలా నెమ్మదిగా నడిపించాడు.

ఫస్ట్‌హాఫ్‌ యాక్షన్ సీన్స్‌, పొలిటికల్‌ పంచ్‌ డైలాగ్‌లతో ఇంట్రస్టింగ్‌గా నడిపించిన మురుగదాస్‌.. సెకండ్‌ హాఫ్‌ను ఆ స్థాయిలో చూపించలేకపోయాడు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన సినిమాలో ఏ మాత్రం థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ లేకుండా కథనం సాధాసీదాగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌ లో వచ్చే సన్నివేశాలు మరీ లాజిక్‌ లేకుండా సిల్లీగా అనిపిస్తాయి. అయితే విజయ్‌ అభిమానులను మాత్రం మురుగదాస్‌ పూర్తి స్థాయిలో అలరించాడనే చెప్పాలి. హీరో బిల్డప్‌, యాక్షన్‌ సీన్స్‌లో విజయ్ ఇమేజ్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. కానీ తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ కావటం మాత్రం కష్టమే.

భారీ బడ్జెట్ సినిమా కావటంతో క్వాలిటీ పరంగా వంక పెట్టడానికి లేదు. ఆర్ట్, సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చాయి. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సీన్స్‌ నెమ్మదిగా సాగుతూ ఇబ్బంది పెడతాయి. ఏఆర్‌ రెహహాన్‌ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా పాటల్లో సాహిత్యం అర్థంకాకపోగా అసలే నెమ్మదిగా సాగుతున్న కథనంలో స్పీడు బ్రేకర్లల మారాయి. పాటలు నిరాశపరిచినా నేపథ్యం సంగీతం మాత్రం అలరిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
విజయ్‌ నటన
యాక్షన్‌ సీన్స్‌
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ ;
లాజిక్‌ లేని సీన్స్‌
స్లో నేరేషన్‌

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

Poll
Loading...
మరిన్ని వార్తలు