‘సినిమా ఆఫర్లు లేవు.. సల్మాన్‌ మాటిచ్చాడు’

3 Jul, 2020 12:56 IST|Sakshi

ముంబై: ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్‌ ఖాన్‌ శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె తీవ్రమైన గుండెపోటుతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక సరోజ్‌ ఖాన్‌ హఠాన్మరణంతో బాలీవుడ్‌ శోక సంద్రంలో మునిగిపోయింది. నృత్య దర్శకురాలికి సెలబ్రిటీలంతా ఘన నివాళులు అర్పిస్తున్నారు. సరోజ్‌ ఖాన్‌ తన 14 ఏళ్ల వయస్సులోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టగా, దిల్‌ హి తో హై(1963) సినిమాలోని ‘నిగహీన్‌ మిలాన్‌ కో జీ చహహ్తా’ పాటకు మొదట కొరియోగగ్రాఫ్‌ చేశారు. అప్పటి నుంచి ఎన్నో సూపర్‌ హిట్‌ పాటలకు కొరియోగ్రాఫ్‌ చేసి ఎంతో మంది ప్రశంసలు పొందారు. (సరోజ్‌ ఖాన్‌ చివరి పోస్ట్‌ అతడి గురించే)

ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరోజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గిపోయాయని వెల్లడించారు. ఆమె పరిస్థితిని గురించి తెలుసుకున్న సల్మాన్‌ ఖాన్‌ సరోజ్‌ ఖాన్‌తో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు పేర్కొన్నారు. ‘నేను సల్మాన్‌ను కలిసినప్పుడు ఏం చేస్తున్నానని అడిగాడు. సినిమా ఆఫర్లు ఏమి లేవని నిజాయితీగా సమాధానమిచ్చాను. కేవలం యువ హీరోయిన్లకు భారతీయ శాస్త్రీయ నృత్యం నేర్పిస్తున్నాని తెలిపాను. అది విన్న వెంటనే సల్మాన్‌ నాతో కలిసి పనిచేస్తానని, నా కొరియోగ్రఫీలో తను డ్యాన్స్‌ చేస్తానని చెప్పాడు. ఇచ్చిన మాటకు సల్మాన్‌ కట్టుబడి ఉంటాడని నాకు తెలుసు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు’ అని సరోజ్‌ ఖాన్‌ పేర్కొన్నారు. (ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత)

నాలుగు దశాబ్దాల కెరీర్‌లో, దాదాపు 200కు పైగా సినిమాలకు 2 వేలకు పైగా పాటలకు సరోజ్‌ ఖాన్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు మూడు జాతీయ అవార్డులు వరించాయి. ఎనిమిది సార్లు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. చివరిసారిగా గతేడాది విడుదలైన మాధురి దీక్షిత్‌ నటించిన ‘కలంక్’‌ చిత్రంలోని ‘తబా హో గయే’ పాటకు కొరియోగ్రఫీ అందించారు. (బాలీవుడ్‌లో విషాదం: గుండెపగిలే వార్త)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా