‘2.ఓ’ చూశాక...

29 Dec, 2018 22:09 IST|Sakshi

రజనీకాంత్‌ పెద్ద హీరో అనందరికీ తెలుసు. ఆయన నటనకు వంక పెట్టలేం. కానీ, 2.0లో ఆయనెంత గొప్పగా నటించినా.. నచ్చడు! నవ్వించడానికి ప్రయత్నించినా.. నవ్వురాదు! రజనీకి మాత్రమే సాధ్యమయ్యే స్టైల్లో డైలాగ్స్‌ చెప్పినా అరవాలనిపించదు. త్రిడీలో రోబోగా ఆయనెన్నీ విన్యాసాలు చేసినా ఆకట్టుకోవు. ఎందుకంటే మనసంతా పక్షిరాజు (అక్షయ్‌కుమార్‌) పైనే ఉంటుంది. పక్షిరాజు మనుషుల్ని చంపుతున్నా కోపం రాదు. ఒకనొక సమయంతో పక్షిరాజు రోబోనూ చంపేస్తే బాగుండనిపిస్తుంది. సుక్ష్మంగా చెప్పాలంటే మన ఎమోషన్‌ పక్షిరాజుతో కలసి నడుస్తుంది. అందుకే రజనీ ఎంత గొప్పగా నటించినా నచ్చడు!  నిజ జీవితంలో సెల్‌ఫోన్లు వాడొద్దంటే మనిషి వింటాడా?  పక్షుల్ని చంపొద్దంటే ఆగుతాడా? అసలు పక్షిరాజు లాంటి వాడు భూమిపై వాలితే వదులుతాడా? వదలడు కాబట్టే ఈ క్రూర జంతువును నాశనం చేయడానికి, మనల్ని సరైన దారిలో పెట్టడానికి పక్షిరాజు లాంటి వాడు వస్తే బాగుండని ప్రతి ఆలోచనకూ అనిపిస్తుంది. అయితే అది సాధ్యమా?..కనుకే నిజ జీవితంలో మనం చేయలేనివి, చేయాలనుకున్నవి తెరపై చూసి మురిసిపోతాం.

ఎదో సాధించామని గర్వపడతాం! నువ్వు బతకాలనుకున్న తీరు, నువ్వు ధ్వంసం చేయాలనుకున్న అన్యాయం, నువ్వు మరిచిపోవాలనుకున్న బాధలు సినిమాలో కనబడిప్పుడు లేదా పుస్తకంలో చదివినప్పుడు గుండెలో గడ్డ కట్టుకున్న భావోద్వేగాలు ఒక్కసారిగా పేలిపోతాయి. లోపలున్న అసంతృప్తులు పారిపోతాయి. మూడు గంటల్లో ఏదో ఒక్క పాత్ర.. అది కొన్ని క్షణాలు సాగినా సరే.. నీ ఉద్వేగానికి మరిచిపోలేని ఉద్దీపన కలిగిస్తే నా ఉద్దేశంలో అది సక్సెస్‌  అయినట్లే! అది సినిమా అయినా, కథ అయినా, కవితయినా! అది నిన్ను కొన్నాళ్లపాటు వెంటాడుతుంది.  పక్షిరాజు అలాంటి ఎమోషనే! ఈ ఒక్క ఎమోషన్‌ చాలు సినిమా చూడటానికి! ఇంకా ‘ఆకలైతే చెయ్యిని నరుక్కుని తింటామా’ వంటి టెక్నాలజీకి చురకలంటించే అద్భుతమైన డైలాగ్స్‌ ఎన్నో ఉన్నాయి!!  
తండ గణేశ్‌  

మరిన్ని వార్తలు