రహస్య వివాహం చేసుకున్న హీరోయిన్

14 Sep, 2016 01:44 IST|Sakshi
రహస్య వివాహం చేసుకున్న హీరోయిన్

 పిచ్చైక్కారన్ చిత్ర నాయకి సాట్నా టైటస్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన పిచ్చైక్కారన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నటి సాట్నాటైటస్. ఆ చిత్రం తమిళంలో విజయవంతమైన విషయం, అంతకంటే సంచలన విజయాన్ని అనువాద చిత్రంగా తెలుగులో సాధించిన విషయం తెలిసిందే. దీంతో నటి సాట్నాకు కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం మెదలెట్టాయి. అయితే పిచ్చైక్కారన్ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన బయ్యర్లలో ఒకరైన కార్తికీ నటి సాట్నాకు మధ్య ప్రేమ చిగురించింది.
 
 దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. నెల రోజుల ముందే ఈ ప్రేమ జంట రిజిస్టర్ వివాహం చేసుకున్నారన్న విషయం కాస్త ఆలస్యంగా బయట పడింది. దీంతో సాట్నా నటించడానికి అంగీకరించిన తిట్టం పోట్టు తిరుడర కూట్టం చిత్రానికి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అదే విధంగా అమీర్ దర్శకత్వంలో నటించడానికి సంగదేవన్ చిత్రం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కాగా నటి సాట్నా తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదని, కార్తీ తన కూతురిని మాయలో పడేశారని, అతని నుంచి సాట్నాను విడిపించాల్సిందిగా నడిగర్ సంఘాన్ని ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది.
 
 ఇలా ఉండగా సాట్నాను రిజిస్టర్ వివాహం చేసుకున్న కార్తీ మాత్రం తమ పెళ్లి ఇరు కుటుంబాల సమ్మతంతోనే జరిగిందని, త్వరలో బహిరంగంగా మళ్లీ వివాహం చేసుకుంటామని పేర్కొనడం గమనార్హం. సాట్నా చిత్రాలను తగ్గించుకుంటున్నార ని, పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పనున్నారని, ఇది తామిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. మరి వీరి వివాహ తంతు ఎటు దారి తీస్తుందో చూద్దాం.