మీరు ఎంచుకున్న మార్గం చాలా మంచిది : అనురాగ్‌ కశ్యప్‌

20 Mar, 2019 12:17 IST|Sakshi

సినీ పరిశ్రమకున్న క్రేజ్‌ చాలా ప్రత్యేకమైనది. ఆ తళుకుబెళుకులకు అలవాటు పడిన వారు సాధరణ జీవితం గడపలేరు. అవకాశాలు తగ్గిపోతే డిప్రెషన్‌లోకి వెళ్లడం.. నేరాలకు పాల్పడటం.. ఆఖరుకి ప్రాణాలు తీసుకోవడం వంటి సంఘటనలను చూస్తూనే ఉంటాం. కానీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తి నేడు.. సెక్యూరిటీ గార్డుగా అనామక జీవితం గడుపుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ స్టోరి పలువురు ప్రముఖుల దృష్టిని ఆకర్షించడమే కాక అభినందనలు కూడా అందుకుంటుంది.

వివరాలు.. ‘బ్లాక్‌ ఫ్రైడే’, ‘గులాల్‌’, ‘పాటియాల హౌస్‌’ వంటి పలు చిత్రాల్లో నటించిన సావి సిద్ధు ప్రస్తుతం అవకాశాలు లేక సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి.. సెక్యూరిటీ గార్డుగా చేరాల్సి వచ్చిన పరిస్థితుల గురించి ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. ​‘12 గంటల ఈ ఉద్యోగం చాలా కష్టమైనది.  చాలా మెకానికల్‌ జాబ్‌. బస్సు టికెట్‌ కొనడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. ఇక సినిమా టికెట్‌ కొనడం అనేది నా జీవితంలో ఓ కలగా మారింది. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు’ అంటూ సావి వీడియోలో తన కష్టాల గురించి తెలిపారు. ఆన్‌లైన్‌లో ట్రెండ్‌ అవుతోన్న ఈ వీడియో రాజ్‌కుమార్‌ రావ్‌, అనురాగ్‌ కశ్యప్‌ వంటి ప్రముఖుల దృష్టికి వచ్చింది.

దాంతో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసినందుకు సదరు యూ ట్యూబ్‌ చానెల్‌కి కృతజ్ఞతలు తెలపడమే కాక సావి ఎంచుకున్న మార్గం ఎందరికో ఆదర్శంగా నిలిచిందంటూ రాజ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాక తన పరిచయస్తులకు సావి గురించి చెప్పి అవకాశాలు ఇప్పిస్తానని తెలిపాడు. ఇక ఈ వీడియో గురించి అనురాగ్‌ కశ్యప్‌ ‘నేను సావి సిద్ధును గౌరవిస్తాను. అవకాశాలు రాని వారు చాలా మంది తాగుతూ.. ఇతర మార్గాల్లో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కానీ సావి మాత్రం గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. బతకడం కోసం ఆయన ఎన్నుకున్న మార్గం చాలా ఉత్తమైనది. డబ్బులిచ్చి ఆయన స్వాభిమానాన్ని దెబ్బ తీయకూడదు.  వారికి సాయం చేయాలనుకుంటే డబ్బు చెల్లించి వారి కళను ఆస్వాదించండి’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు