సావిత్రి స్వీయ తప్పిదాలే...

24 May, 2018 15:15 IST|Sakshi
నటి సావిత్రి (పాత చిత్రం)

సాక్షి, చెన్నై: దిగ్గజ నటి సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ ఇటు తెలుగులో, ‘నడిగయర్‌ తిలకం’ పేరుతో అటు తమిళ్‌లో సూపర్‌ హిట్‌ టాక్‌తో ప్రదర్శితమౌతోంది. అయితే సావిత్రి ఎదుగుదల.. పతనాన్ని కూలంకశంగా చూపించిన ఈ చిత్రంపై పలువురు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. తన తండ్రిని చిత్రంలో తప్పుడుగా చూపించారంటూ కమల సెల్వరాజ్‌(జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె) మహానటిపై పెదవి విరిచారు. (పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్‌ చెయ్యండి). ఇప్పుడు ఈ చిత్రంపై జెమినీ గణేషన్‌ సన్నిహితుడు, సీనియర్‌ నటుడు రాజేష్‌ కూడా స్పందించారు.  సావిత్రి జీవితం అలా అయిపోవటానికి ఆమె స్వీయ తప్పిదాలే కారణమని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘జెమినీ గణేషన్‌కు వివాహం అయిన సంగతి సావిత్రికి తెలుసు. అయినా ఆమె ఆయన్ని ప్రేమించింది. పెళ్లయిన వ్యక్తిని ప్రేమించడం నైతికత కాదన్నది ఆమెకు తెలీదా?. పైగా జెమినీ లైప్‌ స్టైల్‌, విలువలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. కానీ, అవేవీ పట్టించుకోకుండా సావిత్రి తప్పటడుగు వేసింది. ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు జెమినీ గణేషన్‌కు వివాహం చేసుకోవటమే’ అని రాజేష్‌ వ్యాఖ్యానించారు. ఇక సావిత్రి కూడా పలువురితో సంబంధాలు నడిపారంటూ కమల సెల్వరాజ్‌ చేసిన వ్యాఖ్యలపై రాజేష్‌ స్పందించారు.  (విబేధాలు కోరుకోవట్లేదు)

 ‘సావిత్రి వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడలేను. కానీ, ఎంజీఆర్‌తో ఆమె నటించపోవటానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని విషయం మాత్రం తెలుసు’ అని పేర్కొన్నారు. సావిత్రి తాగుడు అలవాటు గురించి ప్రస్తావిస్తూ... ‘ ఉదాహరణకు సమాజంలో హోదా ఉన్న ఓ వ్యక్తి నన్ను తాగమని బలవంతపెడితే నేను తప్పకుండా తాగుతాను. మోడ్రన్‌ కల్చర్‌లో అదో భాగం. జెమినీ గణేషన్‌ కూడా సావిత్రిని అలానే ప్రొత్సహించారు. కానీ, ఆమె తాగుడుకు బానిసై పోయారు. అది కూడా ముమ్మాటికీ సావిత్రి తప్పే’  అని రాజేష్‌ పేర్కొన్నారు.

                                                       సీనియర్‌ నటుడు రాజేష్‌

మరిన్ని వార్తలు