కాంబినేషన్‌ని కాదు.. కంటెంట్‌ని నమ్మారు

25 Oct, 2018 00:41 IST|Sakshi

నాగచైతన్య

నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, మోహన్‌ సీవీయం, రవిశంకర్‌లు నిర్మించారు. ‘కార్తికేయ, ప్రేమమ్‌’ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు సుకుమార్‌ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ చాలా బావుంది. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఇటువంటి సినిమా ఇంతవరకు రాలేదనుకుంటున్నాను.

చాలా వెరైటీ సబ్జెక్ట్‌. ఇలాంటి సబ్టెక్ట్‌తో సినిమా చేయటం చందు అదృష్టం. కీరవాణి గారి సంగీతం గురించి నా స్నేహితుడు దేవీశ్రీ ప్రసాద్‌ ఎంతో గొప్పగా చెబు తుంటాడు. స్పూన్‌ కిందపడితే వచ్చే శబ్దం కూడా ఏ రాగమో కీరవాణిగారు చెబుతారని, ఆయన అంతటి సంగీత జ్ఞాని అని మేమిద్దరం మాట్లాడుకుంటాం. నిర్మాతల గురించి చెప్పాలంటే ముగ్గురూ మూడు పనులను పంచుకొని చాలా స్పీడ్‌గా వర్క్‌ చేస్తారు. నా ‘100 పర్సెంట్‌ లవ్‌’ టైమ్‌లో హీరో చైతూ, నేను రెగ్యులర్‌గా 100 పర్సెంట్‌  టచ్‌లో ఉండేవాళ్లం. ఇప్పుడు సామ్‌ (సమంత)తో ఉన్నందువల్ల 99 పర్సెంట్‌ మాత్రమే టచ్‌లో ఉన్నాడు (నవ్వూతూ). ట్రైలర్‌లో చైతూ చాలా అందంగా ఉన్నాడు’’ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ– ‘‘చందూతో మంచి అనుబంధం ఏర్పడింది.

ఈ జర్నీలో ఎన్నో సార్లు తిట్టాను, కసురుకున్నాను కూడా. తన మంచి కోసమే అనుకునేంత మంచి గుణం అతనిది’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మేము ‘ప్రేమమ్‌’ చేసే టైమ్‌లో వేరే కంట్రీలో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు చిన్న లైన్‌లో ఈ కథ చెప్పాడు చందూ. చాలా బావుంది అన్నాను. మా కాంబినేషన్‌ కంటే కంటెంట్‌ను నమ్మి చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌కు థ్యాంక్స్‌. ఏ సినిమాకైనా ట్రైలర్‌ విడుదలైనప్పుడు మెసేజ్‌లు వచ్చేవి. కానీ ఈ సినిమా ఫస్ట్‌ సాంగ్‌ రిలీజవ్వగానే కాంప్లిమెంట్స్‌ వచ్చాయి’’ అన్నారు. ‘‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 27న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబోతున్నాం. నవంబర్‌ 2న సినిమాని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు చిత్రనిర్మాతల్లో ఒకరైన నవీన్‌ ఎర్నేని.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా