నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను!

12 Mar, 2020 10:20 IST|Sakshi

చెన్నై : నువ్వు లేని జీవితాన్ని కలలో కూడా ఊహించుకోలేను అని నటి సాయేషా సైగల్‌ పేర్కొంది. ఈ అమ్మడు ఎవరి గురించి ఇలా చెప్పిందో ఊహించవచ్చు. ఎస్‌ తన భర్త ఆర్య గురించే అలా తన భావాన్ని వెల్లడించింది. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత తెలుగులో అఖిల్‌ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత, తమిళంలోకి దిగుమతి అయిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి సాయేషా. ఆ తరువాత నటుడు ఆర్యతో కలిసి గజనీకాంత్‌ చిత్రంలో జత కట్టింది. ఆ చిత్రమే వారిద్దరిని నిజ జీవితంలో ఆలుమగలను చేసింది. అవును గజనీకాంత్‌ చిత్రంతో పరిచయం ఆర్య, సాయేషాసైగల్‌ల మధ్య ప్రేమకు దారి తీయడం,ఆ వెంటనే ఇరుకుటుంబాల సమ్మతంతో పెళ్లి చేసుకోవడం చాలా సైలెంట్‌గా జరిగిపోయాయి. 2019, మార్చి 10 తేదీ ఈ జంట నిజజీవితంలో ఒకటైన రోజు అంటే మంగళవారానికి సరిగ్గా వివాహ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

కాగా ఈ సందర్భంగా ఆర్య, సాయేషా తాజాగా కలిసి నటిస్తున్న టెడీ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.ఇదో విశేషం అయితే తొలి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్య గురించి సాయేషా తన ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ చేసింది. అందులో నన్ను అన్ని విధాలుగా సంపూర్ణం చేసిన మనిషికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను. ప్రేమ,ఉత్సాహం, స్థిరత్వం, స్నేహం అన్నీ ఒకేసారి లభించాయి. నేను నిన్ను ఇప్పటికీ, ఎప్పటికీ  ఇష్టపడతాను అని పేర్కొంది.అందుకు నటుడు ఆర్య బదులిస్తూ ఎప్పటికీ అన్నది భవిష్యత్‌ కాలం. అయితే దాన్ని నీతో గడపడానికి ఎలాంటి సంకోచంలేదు. నేను నేనుగా ఉండడానికి కారణం నువ్వే. నేను నిన్ను ఎంతగానే ప్రేమిస్తున్నాను. నువ్వు నువ్వుగా ఉండడానికి ధన్యవాదాలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఆర్య పేర్కొన్నారు. వీరు ఒకరికొకరుఇలా ప్రేమ నిండిన మనసుతో శుభాకాంక్షలు తెలుపుకున్న విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు