మేకప్‌.. మేకోవర్‌!

24 May, 2020 06:09 IST|Sakshi
సొంత మేకప్‌లో సీరత్‌ కపూర్‌

‘‘రంగేయడానికి ఒకళ్లు.. జడేయడానికి ఒకళ్లు.. బాగానే ఉంది దర్జా.. హ్హహ్హహ్హ’’.... ‘మహానటి’ సినిమాలోని డైలాగ్‌ ఇది. సావిత్రి పాత్రధారి కీర్తీ సురేషకి మేకప్‌ ఆర్టిస్ట్‌ మేకప్‌ వేసి, హెయిర్‌ స్టయిలిస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ చేసేటప్పుడు ఆమె పెదనాన్న పాత్రధారి రాజేంద్రప్రసాద్‌ ఈ డైలాగ్‌ అంటారు. షూటింగ్‌ ఉంటే అంతే.. సహాయకులు చాలామంది ఉంటారు. ఈ లాక్‌డౌన్‌లో షూటింగ్‌లు బంద్‌. ఇంట్లో ఉంటున్న తారలు ‘నో మేకప్‌’ అంటున్నారు. సీరత్‌ కపూర్‌ కూడా అలానే అనుకున్నారు.

కానీ సొంతంగా మేకప్‌ చేసుకోగలమా? అని డౌట్‌ వచ్చినట్లుంది. అందుకే సొంత మేకప్‌ ప్రయత్నించారు. సీరత్‌ జుట్టు వంకీలు తిరిగి ఉంటుంది. ముందు ఆ జుట్టుని స్ట్రెయ్‌టినింగ్‌ చేశారు. ఆ తర్వాత ఓ కొత్తరకం హెయిర్‌ స్టయిల్‌ చేసుకుని, మేకప్‌ చేసుకున్నారు. ఇక లాక్‌డౌన్‌ టైమ్‌ గురించి సీరత్‌ మాట్లాడుతూ – ‘‘ఇల్లనేది అందమైన కవిత లాంటిదని నా ఫీలింగ్‌. కవితలో రాసేవన్నీ బాగుండాలనుకుంటాం. అలాగే ఇల్లంతా బాగుండాలని కోరుకుంటాను. ఇంటికి సంబంధించినవన్నీ స్వయంగా నేనే కొన్నాను. ఈ ఖాళీ సమయంలో ప్రతిదీ శుభ్రం చేస్తున్నాను. అయినా ఇంకా ఎంతో కొంత టైమ్‌ మిగులుతోంది. అందుకే సరదాగా సొంత మేకప్, కొత్త హెయిర్‌ స్టయిల్‌ ప్రయత్నించాను. షూటింగ్స్‌ బాగా మిస్సవుతున్నాననిపిస్తోంది’’ అన్నారు.

మేకప్‌ చేసుకోవడమే కాదు.. మేకోవర్‌ మీద కూడా దృష్టి పెట్టారు సీరత్‌. ఆ విషయం గురించి సీరత్‌ మాట్లాడుతూ –‘‘ఆరోగ్యకరమైన పద్ధతిలో సన్నబడుతున్నాను. ‘ఈఎమ్‌ఎస్‌’ (ఎలక్ట్రో మజిల్‌ స్టిములేషన్‌) ట్రైనింగ్‌ తీసుకుంటున్నాను. వారానికి రెండుసార్లు 20 నిముషాలు ఈ ట్రైనింగ్‌ ఉంటుంది. ఇది వారానికి మూడుసార్లు చేసే ‘స్ట్రెంత్‌ ట్రైనింగ్‌’కి సమానంగా ఉంటుంది. ఈఎమ్‌ఎస్‌ కాకుండా పైలెట్స్‌ చేస్తాను. ఇప్పుడు ఇంటి పనులు కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం బరువు తగ్గడానికి చాన్స్‌ ఉంటుంది. హెల్తీ డైట్‌ ఫాలో అవుతున్నాను’’ అన్నారు. తెలుగులో ‘రన్‌ రాజా రన్‌’, ‘టైగర్‌’, ‘రాజుగారి గది 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్‌ చేసి చూడు’ చిత్రాల్లో ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే నటనను కనబరిచారు సీరత్‌. ఆమె నటించిన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ విడుదలకు సిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు