సమాధానం చెప్పాలనుకున్నా... ‘ఫిదా’తో చెప్పా!

28 Jul, 2017 15:55 IST|Sakshi
సమాధానం చెప్పాలనుకున్నా... ‘ఫిదా’తో చెప్పా!

శేఖర్‌ కమ్ముల

‘‘శేఖర్‌ కమ్ముల సినిమా చాలా నేచురల్‌గా, పల్లెటూరి వాతావరణంలో ఉంటుంది. అతని సినిమాల్లో ఆ బ్రాండ్‌ ఉంటుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. వరుణ్‌ తేజ , సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ‘ఫిదా’ ఈ నెల 21న విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం ‘ఫిదా’ సంబరాలు’ నిర్వహించారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘సక్సెస్‌ రేషియో ఎక్కువ ఉన్నందుకు ఈర్ష్యతో రాజుగారికి కంగ్రాట్స్‌ చెబుతున్నా (నవ్వుతూ). అనిత (‘దిల్‌’ రాజు సతీమణి)గారి ఆశీర్వాదాలు ఉండటం వల్లే వరుస హిట్స్‌ వస్తున్నాయి. కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని నమ్మే తక్కువ మందిలో రాజు ఒకడు. వరుణ్‌ గత సినిమా ప్రివ్యూ చూసి ‘సారీ’ చెప్పా. ‘ఫిదా’ చూడగానే కంగ్రాట్స్‌ చెప్పా. వరుణ్‌ ఈ సినిమాలో చాలా నేచురల్‌గా చేశాడు.

సాయి పల్లవి చాలా మంచి డ్యాన్సర్‌. బాగా నటించారు’’ అన్నారు. నటుడు–దర్శక–నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘మా గురువు దాసరి నారాయణరావు తర్వాత నన్ను ఆదరించిన వ్యక్తి అరవింద్‌గారు. అగ్ర నిర్మాతలంటే రామానాయుడు, విజయ బాపినీడు, అల్లు అరవింద్‌గారు. ‘దిల్‌’ రాజు తక్కువ వయసులో ఆ స్థాయికి చేరుకోవడం గ్రేట్‌. ‘మైఖేల్‌ జాక్సన్‌’ బయోపిక్‌ని అల్లు అర్జున్‌తో మీరు (అరవింద్, రాజు) తీయాలి. హృషికేష్‌ ముఖర్జీ, గుల్జార్‌ వంటి దర్శకులు ఇండియాలో రారా అనుకున్నా.. శేఖర్‌ కమ్ముల వచ్చారు. ‘పెళ్లిసందడి’ రాఘవేంద్రరావుగారు, ‘ఫిదా’ శేఖర్‌ కమ్ములనే తీయాలి. వేరే ఎవరు తీసినా ఫ్లాపే’’ అన్నారు. ‘దిల్‌’రాజు మాట్లాడుతూ– ‘‘‘ఫిదా’ను ఆదరించిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పేందుకే ఈ సంబరాలు. ఇవి ఇంకా కొనసాగుతాయి. నా సినిమాల్లో నేను ఇన్‌వాల్వ్‌ అవుతుంటా. ‘ఫిదా’ అనుకున్నప్పుడు ఇది పక్కా శేఖర్‌ కమ్ముల ఫిల్మ్‌. మనం ఇన్‌వాల్వ్‌ అయితే ఈ సినిమా కిచిడీ అయిపోతుందని ఆయనకే అప్పజెప్పా. ‘ఫిదా’కి ‘దిల్‌’ రాజు జస్ట్‌ ప్రొడ్యూసర్‌. ఒక సినిమాకి రైట్‌ వేవ్‌లెన్త్‌ ఉంటే ఇలాంటి రిజల్ట్‌ వస్తుంది. మా సమష్టి కృషికి వచ్చిన మంచి రిజల్ట్‌ ఇది. చాలా గ్యాప్‌ తర్వాత మా బ్యానర్‌లో ‘బొమ్మరిల్లు’తో ‘ఫిదా’ని పోలుస్తున్నారు. ఇందులోని పాత్రలు హార్ట్‌కి టచ్‌ అయ్యాయి’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘రాజుగారికి సినిమా అంటే ప్యాషన్‌.. ప్రేమ. డైరెక్టర్‌కి ఫ్రీడమ్‌ ఇస్తారు. మా అబ్బాయికి హిట్‌ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ‘మిస్సమ్మ’లో మహానటి సావిత్రి ఎంత బాగా చేసిందో భానుమతి పాత్రలో సాయిపల్లవి అంత గొప్పగా చేసింది. నాకు తెలిసి సావిత్రిగారి నిజమైన వారసురాలు సాయిపల్లవి.

http://img.sakshi.net/images/cms/2017-07/51501178245_Unknown.jpgవరుణ్‌ చాలా నేచురల్‌గా చేశాడు. కొన్ని సినిమాలకెళితే గయ్యాళి పెళ్లాంతో విహారయాత్రకు వెళ్లినట్టుంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుంది వెళ్లిపోదామా అనిపిస్తుంది. కొన్ని సినిమాలకెళితే అందమైన గర్ల్‌ఫ్రెండ్‌తో విహారయాత్రకు వెళ్లినట్టుంటుంది. ‘ఫిదా’ సినిమాకెళితే ఒక మంచి గర్ల్‌ఫ్రెండ్‌తో టూర్‌ వెళ్లినట్టు ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు యూనిట్‌ బాడీ అయితే ఆత్మ తెలంగాణ. గుండె సాయిపల్లవి. నార్మల్‌ హిట్‌తో నేను హ్యాపీ అయ్యేవాణ్ణి కాదు. చాలా రోజులుగా డైరెక్టర్స్‌ లిస్ట్‌లో నా పేరు లేదు. అందుకే నా సినిమాతో సమాధానం చెప్పాలనుకున్నా. అది ‘ఫిదా’తో సాధ్యమైంది’’ అన్నారు  శేఖర్‌ కమ్ముల.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నా సినిమాకి సక్సెస్‌ మీట్‌ చేసుకోలేదు. చాలా సినిమాలు హిట్, ఫ్లాప్‌ అవుతుంటాయి. కొన్ని సినిమాలను ప్రేక్షకులు బాగా ఓన్‌ చేసుకుంటారు. అటువంటి చిత్రమే మా ‘ఫిదా’. భానుమతి పాత్ర లేకుండా ఫిదా సినిమా ఉండదు’’ అన్నారు. నటులు సాయిచంద్, ‘సత్యం’ రాజేష్, అరుణ్, శరణ్య, హీరోయిన్‌ సాయి పల్లవి, సంగీత దర్శకుడు శక్తీ కాంత్, పాటల రచయితలు సుద్దాల అశోక్‌తేజ, వనమాలి, చైతన్య పింగళి, ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్త :
‘దిల్ రాజును చూస్తే ఈర్ష్యగా ఉంది’