నట గురువు ఇక లేరు

3 Aug, 2019 00:55 IST|Sakshi
దేవదాస్‌ కనకాల

రజనీకాంత్, చిరంజీవి ఇప్పటి సూపర్‌స్టార్స్‌. కానీ వాళ్లకు నటనలో ఓనమాలు దిద్దించిన నటగురువు దేవదాస్‌ కనకాల. వీరే కాదు రాజేంద్రప్రసాద్, ‘శుభలేఖ’ సుధాకర్, నాజర్, ప్రదీప్‌ శక్తి, భాను చందర్, అరుణ్‌ పాండ్యన్, రఘువరన్, రాంకీ వంటి నటులందరికీ నటనలో శిక్షణ ఇచ్చిన దేవదాస్‌ కనకాల ఇక లేరు. నటుడిగా, దర్శకుడిగా, నట శిక్షకుడిగా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేవదాస్‌ కనకాల ప్రయాణం సాగింది. నిన్నటితో ఆ ప్రయాణం ఆగిపోయింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం దేవదాస్‌ కనకాల మృతి చెందారు.

1945 జూలై 30 యానాంలోని కనకాల పేటలో కనకాల పాపయ్య, మహాలక్ష్మికి జన్మించారు. ఫ్రెంచ్‌ పరిపాలనలో ఉన్నప్పుడు వీరి తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు కూడా. దేవదాస్‌ కనకాల విశాఖపట్టణంలోని ఎ.వి.యన్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్‌ ఆర్ట్స్‌ చదివారు. సినిమా కోసం ఉద్యోగాన్ని సైతం వదిలేశారాయన. పూణే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యనభ్యసించిన తర్వాత నటనలో శిక్షణ కేంద్రం స్థాపించారు. ఎందరో నటీనటులను తీర్చిదిద్ది ఇండస్ట్రీకి పంపించారాయన.

చెన్నైలోని అడయార్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో, హైదరాబాద్‌లోని మధు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అధ్యాపకునిగా చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నటుడిగా ‘ఓ సీత కథ, సిరి సిరి మువ్వ, గ్యాంగ్‌లీడర్, మంచు పల్లకి. అమ్మో ఒకటో తారీఖు, మల్లీశ్వరీ, కింగ్, అసాధ్యుడు’ వంటి సినిమాల్లో నటించారు. ‘అమృతం’ టీవీ సీరియల్‌లో కూడా నటించారు. ‘చలి చీమలు, నాగవల్లి’ అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. దేవదాస్‌ కనకాల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురుదక్షిణగా రజనీకాంత్‌ తన డేట్స్‌ ఇచ్చినప్పటికీ దేవదాస్‌ కనకాల తిరస్కరించారట. 1971 నవంబర్‌ 21న లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు.

వీరి పిల్లలు రాజీవ్‌ కనకాల, శ్రీ లక్ష్మీ కనకాల ఇద్దరూ నటనా రంగంలోనే ఉన్నారు. రాజీవ్‌ కనకాల భార్య సుమ ప్రముఖ యాంకర్‌. శ్రీ లక్ష్మి నాటక రంగ ప్రముఖులు డా. పెద్ది రామారావును వివాహం చేసుకున్నారు. 2018లో దేవదాస్‌ భార్య లక్ష్మీ దేవి మరణించారు. భార్య దూరం అయిన బాధలో దేవదాస్‌ ఎక్కువ శాతం ఇంటికే పరిమితం అయ్యారు. మహేశ్‌బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ ఆయన నటించిన చివరి చిత్రం. దేవదాస్‌ కనకాల మృతి పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. శనివారం ఉదయం మణికొండలోని స్వగృహానికి దేవదాస్‌ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి తరలిస్తారు. ఉదయం 11.30. తర్వాత అంత్యక్రియలు ఆరంభమవుతాయి.

భార్య లక్ష్మీదేవి, కొడుకు, కోడలు రాజీవ్, సుమలతో...దేవదాస్‌ కనకాల

మరిన్ని వార్తలు