దేవదాస్‌ కనకాల ఇక లేరు

3 Aug, 2019 02:06 IST|Sakshi

అనారోగ్యంతో చికిత్స పొందుతూ కిమ్స్‌ ఆసుపత్రిలో కన్నుమూత

పలువురు ప్రముఖుల సంతాపం.. నేడు అంత్యక్రియలు

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు, నటన శిక్షకుడు దేవదాస్‌ కనకాల (75) ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్ను మూశారు. గత నెల 27న కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌ కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటినుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. దీనికితోడు పలు అవయవాలు పనిచేయకపోవడంతో.. దేవ దాస్‌ కనకాల మృతి చెందారు. ఆయనకు కుమారుడు రాజీవ్‌ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. రాజీవ్‌ సినీ నటుడిగా, కోడలు సుమ టీవీ యాంకర్‌గా సుపరిచితులు.

నటుల ఫ్యాక్టరీ
తూర్పు గోదావరి జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 1945 జూలై 30న కనకాల పాపయ్య నాయుడు, మహాలక్ష్మమ్మ దంపతులకు దేవదాస్‌ జన్మించారు. యానాం శివారులోని కనకాలపేట ఆయన స్వగ్రామం. దేవదాస్‌ తండ్రి పాపయ్య.. ఫ్రెంచి పాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. నటుడిగా, శిక్షకుడిగా దేవదాస్‌ కనకాల ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చలిచీమలు, నాగమల్లి సినిమాలకు దర్శకత్వం వహించారు. సిరిసిరిమువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్‌ లీడర్‌ తదితర చిత్రాల్లో దేవదాస్‌ నటించారు. చివరగా ‘భరత్‌ అనే నేను’చిత్రంలోనూ కనిపించారు. హైదరాబాద్‌లో యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటుచేసి నటనలో శిక్షణనిచ్చారు.

రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్, భానుచందర్, రఘువరన్, నాజర్, తదితర ప్రముఖులు దేవదాస్‌ శిష్యులే. ఆయన కుమారుడు రాజీవ్‌ కనకాల, కోడలు సుమ చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించారు. 2018లో సతీమణి లక్ష్మి మృతిచెందడం ఆయన్ను కలిచివేసింది. అప్పటి నుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ నటులు కొండా పూర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం ఆస్పత్రిలోనే ఉంచారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మణికొండలోని స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నారు. ఉదయం 11:30గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచి, అనంతరం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

సీఎం సంతాపం
సీనియర్‌ నటుడు దేవదాసు కనకాల మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. నటన శిక్షణ సంస్థను నెలకొల్పి ఎందరినో సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దేవదాసు కనకాల మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటని సీఎం పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా