నటి వాణిశ్రీకి పుత్రశోకం

24 May, 2020 02:44 IST|Sakshi
వాణిశ్రీ, అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌

ప్రఖ్యాత నటీమణి వాణిశ్రీ ఇంట విషాదం నెలకొంది. వాణిశ్రీ కుమారుడు అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌ (36) శుక్రవారం రాత్రి హఠాన్మరణం పొందారు. అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌ బెంగళూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల చెన్నై వెళ్లిన ఆయన తండ్రి కరుణాకరన్‌తో పాటు చెంగల్పట్టు జిల్లాలోని తిరుకళికుండ్రం గ్రామంలో ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారు. కార్తీక్‌ భార్య, పిల్లలు చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న వాణిశ్రీ ఇంట్లో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌ తండ్రి వద్దే ఉండిపోయారు.

శుక్రవారం అర్ధరాత్రి ఫామ్‌హౌస్‌లో గుండెపోటు కారణంగా నిద్రలోనే కార్తీక్‌ మృతి చెందినట్టు వాణిశ్రీ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కార్తీక్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని వాణిశ్రీ కుటుంబసభ్యులు ఖండించారు. అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌ భౌతికకాయాన్ని శనివారం చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. వాణిశ్రీకి పలువురు సినీ ప్రముఖులు సానుభూతి తెలిపారు. కార్తీక్‌ మృతిపై చెంగల్పట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.
– సాక్షి, చెన్నై

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు