నాన్న చాలా బాధ పడేవారు: దాసరి అరుణ్

18 Jun, 2017 07:33 IST|Sakshi
నాన్న ఇష్టాన్ని నెరవేరుస్తా!

‘‘నాన్న చనిపోయారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. అసలిలా జరుగుతుందని ఊహించలేదు’’ అని దాసరి అరుణ్‌కుమార్‌ అన్నారు. ఇటీవల ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన మరణం సినీ వర్గాలకు పెద్ద లోటు. ‘‘మా ఫ్యామిలీకి కూడా తీరని లోటు’’ అని అరుణ్‌ కుమార్‌ చెబుతూ– ‘‘నాన్న ఆపరేషన్‌కి వెళ్లే ముందు ధైర్యంగా కనిపించారు. ఇలా జరుగుతుందని ఆయన ఊహించలేదు. మేం కూడా ఊహించలేదు’’’ అన్నారు.

మీ కెరీర్‌ పుంజుకుంటే బాగుంటుందని పలు సందర్భాల్లో దాసరిగారు అన్నారు. మీతో ఆ విషయం గురించి మాట్లాడేవారా? అనే ప్రశ్నకు – ‘‘సినిమాలు చెయ్యిరా.. ఎదగాలి’ అనేవారు. నేనేమో అంత ఇంట్రస్ట్‌ చూపించేవాణ్ణి కాదు. నాన్నకి బాధగా ఉండేది. ఆయన ఉన్నప్పుడు నాకేం అనిపించలేదు కానీ, ఇప్పుడు నాన్న ఇష్టాన్ని తీర్చాలనే సెంటిమెంట్‌ బలపడింది. అందుకే ఇకనుంచి సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. హీరోగా చేస్తారా? అనడిగితే – ‘‘అలా ఆలోచిస్తే తప్పు అవుతుంది. హీరోగా చేయడం కరెక్ట్‌ కాదు. మంచి క్యారెక్టర్‌ రోల్స్, విలన్‌గా చేయాలనుకుంటున్నా’’ అని అరుణ్‌కుమార్‌ అన్నారు. మీ నాన్నగారిలా డైరెక్షన్‌ చేయరా? అనడిగితే – ‘‘డైరెక్షన్‌ చాలా చాలా టఫ్‌. నా వల్ల కాదు. ప్రొడక్షన్‌ వ్యవహారాలు మాత్రం చూసుకోగలుగుతాను. నాన్న ఉన్నప్పుడు చూసేవాణ్ణి’’ అన్నారు.