7(సెవెన్) మూవీ రివ్యూ

6 Jun, 2019 07:57 IST|Sakshi

టైటిల్ : 7 (సెవెన్)
జానర్ : థ్రిల్లర్‌
తారాగణం : హవీష్, రెహమాన్‌, రెజీనా, నందితా శ్వేతా, త్రిదా చౌదరి, అనీషా ఆంబ్రోస్‌, పూజితా పొన్నాడ, అదితి ఆర్య
సంగీతం : చేతన్‌ భరద్వాజ్
దర్శకత్వం : నిజార్‌ షఫీ
కథ, నిర్మాత : రమేష్ వర్మ

థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. సరైన కంటెంట్‌తో తెరకెక్కితే ఈ జానర్‌ సినిమాలు సీజన్‌తో సంబందం లేకుండ ఆడేస్తాయి. అందుకే లాంగ్‌ గ్యాప్‌ తరువాత హవీష్‌ హీరోగా నటించేందుకు ఈ జానర్‌నే ఎంచుకున్నాడు. దర్శకుడు రమేష్‌ వర్మ నిర్మాతగా మారి స్వయంగా కథ అందించి నిజార్‌ షఫీని దర్శకుడిగా పరిచయం చేస్తూ 7(సెవెన్‌) సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? ఏకంగా ఆరుగురు హీరోయిన్‌లు నటించిన 7 ఆడియన్స్‌ను మెప్పించిందా?

కథ ;
రమ్య( నందితా శ్వేతా) అనే అమ్మాయి తన భర్త కార్తీక్‌ రఘునాథ్‌ (హవీష్) కనిపించటం లేదంటూ కేసు పెట్టేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వస్తుంది. తన భర్తతో దిగిన ఫోటోలను స్టేషన్‌లో ఇస్తుంది. ఆమె కథ విన్న ఏసీపీ విజయ్‌ ప్రకాష్‌ (రెహమాన్‌) షాక్‌ అవుతాడు. రమ్యను మోసం చేసినట్టుగానే కార్తీక్‌ గతంలో జెన్నీ అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని మోసం చేశాడని తెలుస్తుంది. దీంతో ఏసీపీ ఈ రెండు కేసులను మిస్సింగ్ కేసులా కాకుండా కార్తీక్‌ వీళ్లను కావాలనే మోసం చేసి వెళ్లిపోయాడన్న అనుమానంతో చీటింగ్‌ కేసుగా మార్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అదే సమయంలో చెన్నైలోనూ మరో అమ్మాయి (అదితి ఆర్య)ని కార్తీక్‌ మోసం చేశాడని తెలుస్తుంది.

ఎంత ప్రయత్నించినా కార్తీక్‌ ఆచూకి దొరక్క పోవటంతో కార్తీక్‌ కోసం పేపర్‌ యాడ్ ఇస్తారు. చివరకు కార్తీక్‌ను అరెస్ట్ చేస్తారు. అయితే కార్తీక్‌ మాత్రం తాను ఎవరినీ మోసం చేయలేదని, అసలు ఆ అమ్మాయిలు ఎవరో తనకు తెలియదని చెప్తాడు. కార్తీక్ చెప్పేది నిజమేనా..? మరి ఆ అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? వీరికి సరస్వతమ్మ (రెజీనా)కు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ కథలో విలన్‌ ఎవరు? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
లాంగ్ గ్యాప్‌ తరువాత నటించిన హవీష్‌ ఇంట్రస్టింగ్‌ కథను ఎంచుకున్నాడు. అయితే కథకు తగ్గ స్థాయిలో వేరియేషన్స్‌ చూపించటంతో మాత్రం తడబడ్డాడనే చెప్పాలి. నటుడిగా ప్రూవ్‌ చేసుకునేందుకు హవీష్ ఇంకా కష్టపడాలి. హీరోయిన్లుగా కనిపించిన వారిలో కాస్త ఎక్కువ సేపు తెర మీద కనిపించిన పాత్ర రెజీనాదే. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో రెజీనా నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో నందితా, అనీషా, త్రిదా, అదితి ఆర్యలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రెహమాన్‌ పర్ఫెక్ట్ గా సూట్‌ అయ్యాడు. నటన పరంగానూ మెప్పించాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు పరవాలేదనిపించారు.


విశ్లేషణ ;
రమేష్‌ వర్మ ఇంట్రస్టింగ్‌ కథను తయారు చేసుకున్నా, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కథనం థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన స్థాయి గ్రిప్పింగ్‌గా అనిపించదు. ఇంట్రస్టింగ్‌గా కథను మొదలు పెట్టిన దర్శకుడు, లవ్ స్టోరిలను మాత్రం చాలా స్లోగా నడిపించాడు. అసలు కథను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు. సెకండ్‌ హాఫ్‌ ను మాత్రం ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించాడు. కార్తీక్ పోలీసులకు దొరికిన తరువాత కథ వెంట వెంటనే మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతుంది. కానీ క్లైమాక్స్‌ విషయంలో మరోసారి తడబడ్డాడు నిజార్‌. 

దర్శకుడిగా తడబడినా సినిమాటోగ్రాఫర్‌గా మాత్రం నిజార్‌ షఫి ఫుల్ మార్క్స్‌ సాధించాడు. హీరోయిన్లను అందంగా చూపించటంతో పాటు ప్రతీ ఫ్రేమ్‌ను రిచ్‌గా కలర్‌ఫుల్‌గా చూపించటంలో సక్సెస్‌ అయ్యాడు. సినిమాకు మరో ఎసెట్‌ నేపథ్య సంగీతం. చేతన్ భరద్వాజ్‌ తన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రతీ సీన్‌ను మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌ ;
ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగే కథనం
ఫస్ట్‌ హాఫ్ స్లో నేరేషన్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

Poll
Loading...
మరిన్ని వార్తలు