‘రాజ్‌కుమార్‌ హిరాణీ నాపై లైంగిక దాడి చేశాడు’

13 Jan, 2019 17:28 IST|Sakshi

సహాయ దర్శకురాలి ఆరోపణలు

ఖండించిన బాలీవుడ్‌ దర్శకుడు

సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఉద్యమం బాలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా  ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీపై లైంగిక దాడి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని ఆయన వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపణలు చేశారు. సంజు సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఆమెపై సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో 2018 మార్చి-సెప్టెంబర్‌ మధ్యకాలంలో హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని, తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ మేరకు ఈ ఘటన గురించి సంజు సినిమా నిర్మాత విధూవినోద్‌ చోప్రాకు ఆమె ఈమెయిల్‌ పంపినట్లు తెలిసింది.

‘హిరాణీ మంచి పేరున్న దర్శకుడు. నేను కేవలం ఆయన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్‌ను. నా పట్ల జరిగినది చాలా పెద్ద తప్పు. నా పట్ల జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేను. ఆయన కారణంగా నా మనసు, శరీరం పాడైపోయాయి. అలా ఆరు నెలల పాటు హిరాణీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనన్న భయం. తప్పని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సిం వచ్చింది’’ అని ఆమె మెయిల్‌ ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచారు.

తనపై వస్తున్న ఆరోపణలను హిరాణీ తీవ్రంగా ఖండించారు. ఆయన తరఫు న్యాయవాది ఆనంద్‌ దేశాయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. హిరాణీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆయపై కావాలనే ఎవరో తప్పడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆయన పేరు చెడగొట్టడానికి ఎవరో ఇలా చేయిస్తున్నారని అన్నారు. రాజ్‌కుమార్‌ హిరాణీ వంటి పెద్ద దర్శకుడిపై ఓ సహాయ దర్శకురాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ మీటూ ఉద్యమం తీవ్రతరమైంది.

మరిన్ని వార్తలు