షారుఖ్ ఇంటికి చేరిన సరోగేట్ బేబి!

9 Jul, 2013 22:28 IST|Sakshi
షారుఖ్ ఇంటికి చేరిన సరోగేట్ బేబి!
అద్గె గర్భం ద్వారా (సరోగేట్) జన్మించిన కుమారుడు అబ్ రామ్ ను ఆస్పత్రి నుంచి మంగళవారం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నివాసానికి తీసుకువచ్చారు. నెలలు నిండకుండానే (ప్రీ మేచుర్డ్) బిడ్డ జన్మించడంతో బిడ్డ ఆరోగ్యం విషమంగా మారింది అని, తాము అందోళనకు గురయ్యామంటూ సరోగేట్ బేబి అబ్ రామ్ వివాదంపై షారుఖ్ ఖాన్ మౌనం వీడారు. గత కొద్దికాలంగా బాబు ఆరోగ్యంపై గౌరీ శ్రద్ద తీసుకుంటుందన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారనే ఆరోపణలను షారుఖ్ ఖాన్ ఖండించారు. 
 
బాబు ఆరోగ్యంపై తాను, తన భార్య గౌరీ ఖాన్ ఆందోళనతో ఉన్న కారణంగానే, లింగ నిర్ఱారణపై మీడియాలో వచ్చిన ఆరోపణలపై తాము తగిన రీతిలో స్పందించలేదని షారుఖ్ తెలిపారు. అబ్ రామ్ పుట్టడానికి ముందు ఎలాంటి లింగ నిర్ధారణ పరీక్షలు చేయలేదు అని, మీడియాలో వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని అన్నారు. మీడియాలో వార్తలు రావడానికి పూర్వమే బాబు జన్మించాడని షారుఖ్ వెల్లడించారు. 
 
అబ్ రామ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో వైద్యులు జతిన్ షా, ఇతర వైద్య బృందం స్పందించిన తీరుకు షారుఖ్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. అబ్ రామ్ ఇంటికి వచ్చిన సమయంలో తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. బాబు పుట్టిన విషయాన్ని తెలియచేయకపోవడం, ఇతర అంశాలకు జవాబివ్వకపోవడం దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. షారుఖ్, గౌరీఖాన్ దంపతులకు ఆర్యన్, సుహానా అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.