‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ ఫ్లాప్‌ అన్న షారూఖ్‌

15 Nov, 2018 11:13 IST|Sakshi

బాలీవుడ్ టాప్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌లు కలిసి నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా అభిమానులను అలరించలేకపోయింది. కథా కథనాలతో పాటు టేకింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

అయితే ఈ విషయంపై స్పందించిన బాలీవుడ్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ థగ్స్‌ టీంకు షాక్‌ ఇచ్చాడు. సాధారణంగా సినిమా టాక్‌ ఎలా ఉన్నా థియేటర్లలో ఉన్నన్ని రోజులు చిత్రయూనిట్‌ సినిమా ఫ్లాప్‌ విషయాన్ని అంగీకరించరు. థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్ టీం కూడా ప్రస్తుతం కలెక్షన్లను చూపిస్తూ సినిమాను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది.

అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన షారూఖ్‌కు థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ సినిమాకు వచ్చిన రిజల్ట్‌ కు సంబంధించి ప్రశ్న ఎదురైంది.  వెంటనే షారూఖ్‌ థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ ఫ్లాప్‌ అవ్వటం తనకు ఎంతో బాధకలిగించిందన్నాడు. అంతేకాదు ‘అమితాబ్‌, ఆమిర్‌లు చాలా కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సేవ చేస్తున్నారు. ఒక్క సినిమా ఫ్లాప్‌ అయినంత మాత్రాన వారిని తక్కువ చేయలేం. గతంలో రావన్‌ సినిమా సమయంలో నాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నా అభిప్రాయం మాత్రం థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్ అద్భుతమైన చిత్రం, ఇలాంటి సినిమా ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో రాలేదు’ అన్నారు. షారూఖ్‌ థగ్స్‌ టీంకు మద్దతుగానే మాట్లాడినా అప్పుడే ఫ్లాప్‌ అని ప్రకటించటం చిత్రయూనిట్‌కు మింగుడు పడటం లేదు.

మరిన్ని వార్తలు