కరీనాకు ఏదీ సరిపోదు!

28 Oct, 2015 23:09 IST|Sakshi
కరీనాకు ఏదీ సరిపోదు!

టాప్ స్టోరీ
డేట్లు కుదరలేదు... కథ నచ్చలేదు... డబ్బుల లెక్క తేలలేదు...
కారణాలు ఏవైనా కరీనా కపూర్ వదులుకున్న సినిమాలు చాలానే.
అందులో ఓ అరడజనయితే, ఆమె మిస్ చేసుకున్న అద్భుతమైన హిట్లు.
కరీనా ఖాతాలో మిస్సయిన ఆ ఆరు సినిమాల కథాకమామిషు.
..
 
అంచనా తప్పింది!
‘ఊహూ.. ఇది వర్కవుట్ కాదు..’ అని బలంగా అనుకుని, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రాన్ని తిరస్కరించారు కరీనా కపూర్. ఆ చిత్రం ద్వారా కరీనాను కథానాయికగా పరిచయం చేయాలనుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఐశ్వర్యారాయ్‌ని కథానాయికగా తీసుకున్నారు. కట్ చేస్తే... ఆ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు పలు జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఐశ్వర్యా రాయ్ కెరీర్ సక్సెస్ ట్రాక్‌లోకి వెళ్లడానికి కారణంగా నిలిచిన చిత్రం ‘హమ్ దిల్ దే చుకే సనమ్’.

ఒకవేళ ఈ చిత్రం అంగీకరించి ఉంటే ఓ ఏడాది ముందే తెరపై మెరిసేవారు. అలా కెరీర్ మొదట్లోనే ఓ సూపర్ హిట్ మూవీలో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నారు కరీనా. కానీ, ఆమె పరిచయం అయిన ‘రెఫ్యూజీ’ కూడా మూమూలు సినిమాయేం కాదు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాకపోతే ‘హమ్ దిల్ దే చుకే సనమ్’తో పోలిస్తే మాత్రం రేంజ్ తక్కువనే చెప్పాలి.
 
డబ్బే ప్రధానం!
కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ మూవీ అనిపించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కరీనా నటనకు ముగ్ధుడైన దర్శకుడు కరణ్ జోహార్ తన తదుపరి చిత్రం ‘కల్ హో నా హో’లో కూడా ఆమెనే కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. కానీ, ‘కభీ ఖుషీ కభీ గమ్’ ఘనవిజయం, అందుకు ముందు చేసిన రెండు, మూడు చిత్రాల విజయంతో కరీనా తన పారితోషికం పెంచేశారు. అ బ్యూటీ అడిగిన పారితోషికం కరణ్ జోహార్‌కి రీజనబుల్‌గా అనిపించక పోవడంతో ప్రీతీ జింతాను తీసుకు న్నారాయన. అందులో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసిన ప్రీతీకి మంచి పేరు వచ్చింది. ‘‘అంత మంచి పాత్ర వదులుకుని తప్పు చేశాను’’ అని ‘కాఫీ విత్ కరణ్’లో కరీనా పేర్కొన్నారు. జీవితాంతం ఆ పశ్చాత్తాపం ఉంటుందని ఆమె అన్నారు.
 
ఫ్యాషన్... పరేషాన్!
మధుర్ భండార్కర్ సినిమాలో అవకాశం అంటే కథానాయికలకు పండగే అనాలి. అవార్డులు దక్కించుకునే పాత్రలు ఇస్తారాయన. అందుకే మధుర్ అవకాశం ఇస్తే, ఏ కథానాయికా కాదనరు. కానీ, ‘ఫ్యాషన్’ చిత్రానికి అడిగినప్పుడు కరీనా కుదరదనేశారు. అలా చెప్పాల్సి వచ్చినందుకు ఆమె చాలా బాధపడ్డారు కూడా. కేవలం డేట్స్ ఖాళీ లేనందువల్లే ఆమె ఈ చిత్రాన్ని వదులుకున్నారు. కట్ చేస్తే... ఆ అవకాశం ప్రియాంకా చోప్రాకు దక్కింది. సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ఉత్తమ నటిగా ప్రియాంకకు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఆ విధంగా బంగారం లాంటి అవకాశం వదులుకుని పరేషాన్ అయిపోయారు కరీనా.
 
మరోసారి అంచనా తప్పింది!
కెరీర్ ప్రారంభంలో సంజయ్ లీలా భన్సాలీ ఇచ్చిన  ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ ఆఫర్‌ను కాదన్న కరీనా కపూర్ మరోసారి ఆయన చిత్రాన్ని తిరస్కరించారు. కరీనాతో ఒక్క సినిమా చేయాలనే ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ‘గోలియోం కీ రాస్‌లీలా: రామ్-లీలా’కి ఆమెను అడిగారు. కరీనా కూడా ఈ చిత్రంలో నటించ డానికి సుముఖత వ్యక్తపరిచారు. లుక్ టెస్ట్‌లో కూడా పాల్గొన్నారామె. కానీ, ఫైనల్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఆమెకు కథ అంత అసంతృప్తిగా అనిపించ లేదట. దాంతో తప్పుకున్నారు. ఆ విధంగా ఆ లక్కీ చాన్స్ దీపికా పదుకొనేని వరించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అలాగే, రణ్‌వీర్ సింగ్, దీపికాల కెమిస్ట్రీ కేక అని ప్రేక్షకులు కితాబులిచ్చేశారు.
 
క్వీన్ కాలేకపోయారు
కంగనా రనౌత్ కెరీర్‌ను మంచి మలుపు తిప్పిన చిత్రం ‘క్వీన్’. చేస్తే ఇలాంటి సినిమా చేయాలని ఇతర కథానాయి కలు సైతం అనుకున్న చిత్రం ఇది. ఈ చిత్రదర్శకుడు వికాస్ బెహల్ క్వీన్ పాత్ర కోసం ముందు కరీనానే అడిగారు. మరి... ఈ చిత్రాన్ని కరీనా ఎందుకు తిరస్కరించారనే కారణం బయటికి రాలేదు. ఆమె కుదరదన్న తర్వాత కంగనా రనౌత్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రం కంగనాను ఎంతో మందికి  హృదయరాణిగా మార్చేసింది.
 
పెళ్లి కారణంగా మిస్సయిన హిట్ మూవీ
ఇప్పుడు సినిమాల కన్నా పెళ్లే ముఖ్యం అంటూ కరీనా కపూర్ వదులుకున్న చిత్రం ‘దిల్ ధడక్‌నే దో’. రియల్ లైఫ్ కజిన్స్ రణ్‌బీర్ కపూర్, కరీనా కపూర్ లను ఈ చిత్రంలో కజిన్స్‌గా నటింపజే యాలని జోయా అనుకున్నారు. ఈ చిత్రకథ ఎక్కువ శాతం ఓ నౌకలో జరుగుతుంది. దాదాపు నెల రోజుల పాటు చిత్రబృందం మొత్తం ఆ నౌకలోనే ఉండాలనే నిబంధన కరీనాకి నచ్చలేదు. దాంతో ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. కరీనా ఎప్పుడైతే ఈ చిత్రాన్ని వదులకున్నారో అప్పుడు రణ్‌బీర్ కూడా కుదరదన్నారు. దాంతో కరీనా స్థానంలో ప్రియాంకా చోప్రాను, రణ్‌బీర్ పాత్రకు రణ్‌వీర్ సింగ్‌ను తీసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ విధంగా కరీనా కెరీర్‌లో ఓ హిట్ మూవీ తగ్గింది.
 
లేటెస్ట్‌గా... సెక్షన్ 84
ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించే అవకాశాలను కథానాయికలు అంత సులువుగా వదులుకోరు. కానీ, కరీనా వదులుకున్నారు. ఇటీవల ‘సెక్షన్ 84’ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రానికి కరీనా కపూర్‌ను సంప్రతించారు దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా. కథ అంతగా అసంతృప్తిగా అనిపించకపోవడం వల్లే ఈ చిత్రం వదులుకు న్నానని కరీనా పేర్కొన్నారు.

ఇందులో కథానాయిక మానసిక రోగి అని సమాచారం. ఒకవేళ కరీనా ఒప్పుకుని ఉంటే, గత నెల ఈ చిత్రం షూటింగ్ ఆరంభం అయ్యుండేది. ఆమె అంగీకరించకపోవడంతో ఆ స్థానంలో వేరే ఎవర్ని తీసుకోవాలనే డైలమాలో దర్శకుడు ఉన్నారట. ఒకవేళ ఈ చిత్రం కూడా హిట్టయితే అప్పుడు కరీనా ఏడు హిట్ సినిమాలు మిస్ చేసుకున్నట్లు అవుతుంది.