రిపబ్లిక్‌ డే నాడు షారుక్‌ వీడియో వైరల్‌

26 Jan, 2020 13:00 IST|Sakshi

‘కులం వద్దు.. మతం వద్దు.. మనమధ్య హద్దులొద్దు... మనమంతా ఒకటే.. భారతీయులమే’ అన్న వ్యాఖ్యలను అక్షరాలా అమలు చేసి చూపిస్తున్నారు బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ ఖాన్‌. రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని డ్యాన్స్‌ ప్లస్‌ 5 షో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎపిసోడ్‌లో శనివారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా ఇంట్లో అసలు మత ప్రస్తావనే రాదు. హిందూ ముస్లింలు అంటూ మతాల గురించి ఎప్పుడూ మాట్లాడుకోం. నా భార్య హిందువు, నేను ముస్లింను. నా పిల్లలిద్దరు భారతీయులు. ఇక పిల్లలు పాఠశాలకు వెళ్లినప్పుడు వారికిచ్చిన ఫామ్స్‌లో వారు ఏ మతమో తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో నా కూతురు మన మతం ఏంటని నన్ను ప్రశ్నించింది. దానికి నేను.. తన ఫామ్‌ తీసుకుని మనకు మతం లేదు.. మతం అని రాసి ఉన్న చోట భారతీయురాలు అని రాసిచ్చాను’ అని పేర్కొన్నారు.

షారుక్‌ తన ఇస్లామిక్‌ మతం గురించి ప్రస్తావిస్తూ ‘రోజుకు ఐదుసార్లు నమాజ్‌ చేయాలి అన్న నిబంధన ప్రకారం నేను ఈ మతానికి చెందినవాడినే కాదు. కానీ నేను ఇస్లామిక్‌నే. ఇస్లాం మతం ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటుంది. దీని సిద్ధాంతాలను నేను విశ్వసిస్తాను’ అని తెలిపారు. మనందరికీ మతమంటూ ప్రత్యేకంగా ఏదీ లేదని మనమంతా భారతీయులమేనన్నారు. షారుక్‌ మాటలు విన్న జనం కరతాళ ధ్వనులతో ఆయనను ప్రశంసించారు. ఇక షారుక్‌ ఇంట్లో అన్ని మతాల పండగలను జరుపుకుంటారనేది తెలిసిన విషయమే. కాగా షారుక్‌ సినిమాలు ఈ మధ్య ఊహించిన రీతిలో ఆడటం లేదు. వరుస ఫ్లాపులు రావడంతో సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన షారుక్‌ ఈ మధ్యే ఓ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పాడు. చదవండి: ఐష్‌ మళ్లీ తల్లి కాబోతున్నారా?

మరిన్ని వార్తలు