మళ్లీ విలన్‌గా నటిస్తా!

10 Dec, 2013 00:37 IST|Sakshi
మళ్లీ విలన్‌గా నటిస్తా!
బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌కి మిస్టర్ పర్‌ఫెక్ట్ అని బ్రాండ్ నేమ్ ఉంది. ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేస్తారాయన. నో బౌండరీస్... నో లిమిటేషన్స్. అంత పెద్ద సూపర్‌స్టార్ అయ్యుండి కూడా విలన్‌గా చేయడమంటే మాటలు కాదు. ‘ధూమ్-3’ కోసం భారతీయ సినీ ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారంటే దానికి కారణం... అందులో ఆమిర్ విలన్‌గా నటించడమే. ఆమిర్ స్ఫూర్తితో షారుక్‌ఖాన్ కూడా విలన్‌గా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా షారుక్‌ఖాన్ మాట్లాడుతూ -‘‘ఆమిర్ గొప్ప నటుడు. ‘ధూమ్-3’లో పాత్ర కోసం తన దేహాన్ని మార్చుకున్న తీరు, కష్టపడిన విధానం నాకు స్ఫూర్తినిస్తోంది. 
 
 విలన్ పాత్ర కోసం ఆమిర్ పడిన తపన అభినందనీయం. కేవలం శారీరక, మానసిక అంశాలే కాకుండా ఆమిర్ చిత్రాలను ఎంచుకునే తీరు, ప్రవర్తన నాకెంతో ఇష్టం’’ అని అన్నారు. ఆమిర్ అందించిన స్ఫూర్తితో మళ్లీ విలన్‌గా నటించాలనిపిస్తోందని షారుక్ తెలిపారు. ‘‘నా కెరీర్ ఆరంభంలో డర్, బాజీగర్, అంజామ్ చిత్రాల్లో విలన్‌గా నటించాను. చాలా కాలంగా అలాంటి పాత్రలు చేయలేదు. ఎవరైనా ఆఫర్ చేస్తే వంద కోట్లు వస్తాయా, రెండు వందల కోట్లు వసూలు చేస్తాయా అనే విషయాన్ని బేరీజు వేయకుండా మళ్లీ విలన్ పాత్రను పోషించాలనుకుంటున్నాను’’ అని షారుక్ తెలిపారు.