విద్యా వ్యవస్థపై పోరాటం

12 Mar, 2020 04:56 IST|Sakshi
కల్యాణి, శివకార్తికేయన్‌

శివ కార్తికేయన్‌ హీరోగా ‘అభిమన్యుడు’ ఫేమ్‌ పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హీరో’. కల్యాణీ ప్రియదర్శన్‌ కథానాయికగా నటించగా, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కీలక పాత్ర పోషించారు. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ‘శక్తి’ పేరుతో తెలుగులోకి అనువాదం అవుతోంది. కే.జి.ఆర్‌ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్మెంట్స్‌ ఆధ్వర్యంలో కోటపాడి. జె.రాజేష్‌ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. పి.ఎస్‌. మిత్రన్‌ మాట్లాడుతూ– ‘‘సూపర్‌ మాన్, స్పైడర్‌ మాన్, శక్తి మాన్‌.. అంటే పిల్లలకే కాదు అన్ని వయసుల వారిలో ఓ స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుంది.

వాళ్ల స్ఫూర్తితో సాహసాలు చేస్తుంటారు కొంతమంది. ఈ చిత్రంలో హీరో కూడా అలాంటివాడే. సూపర్‌ హీరోలా మారి విద్యా వ్యవస్థలోని విషయాలపై ఎలా పోరాడాడు? అన్నదే కథాశం. వాస్తవ ఘటనల ఆధారంగానే తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘ఏదైనా విభిన్న నేపథ్యం లేకపోతే శివ కార్తికేయన్‌ సినిమా చేయరు. ‘శక్తి’ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తూ హార్ట్‌ని టచ్‌ చేస్తుంది. బాలీవుడ్‌ నటుడు అభయ్‌ డియోల్‌ నటించిన తొలి దక్షిణాది చిత్రం ఇదే’’ అన్నారు కోటపాడి. జె. రాజేష్‌.

మరిన్ని వార్తలు