శంకర్‌@25 ఆనందలహరి

22 Apr, 2019 10:54 IST|Sakshi

తమిళసినిమా: శంకర్‌@25 అనగానే అందరికీ అర్థంఅయిపోయే ఉంటుంది. ఇది స్టార్‌ దర్శకుడు శంకర్‌కు సంబంధించిన సమాచారం అని. సినిమా కచ్చితంగా వ్యాపారమే. దానికి బ్రహ్మండాన్ని, ప్రపంచ స్థాయి మార్కెట్‌ను తీసుకొచ్చిన దర్శకుల్లో ఆధ్యుడు శంకర్‌ అని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. ఎక్కడో తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పుట్టిన శంకర్‌ అనే ఒక సాధారణ యువకుడు ఇప్పుడు ప్రపంచ సినిమా తిరిగి చూసే స్థాయికి ఎదిగారు. 25 ఏళ్ల క్రితం నటుడవ్వాలన్న కలతో చెన్నైనగరానికి చేరిన శంకర్‌ చిన్న చిన్న వేషాలు వేసినా, ఆయన్ని విధి దర్శకత్వం వైపు పరుగులు దీయించింది. అంతే అప్పటికే ప్రముఖ దర్శకుడిగా వెలుగొందుతున్న ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ వద్ద శిష్యుడిగా చేరిపోయారు. అలా కొన్నేళ్లు ఆయన వద్ద పని చేసి జంటిల్‌మెన్‌ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టారు.అది బ్రహ్మ ముహూర్తం అయ్యి ఉంటుంది. తొలి చిత్రంతోనే విజయాన్ని అందించింది.

ఆ తరువాత ముదల్వన్, బాయ్స్, జీన్స్, శివాజి, ఇండియన్, ఐ, ఎందిరన్‌ వంటి పలు బ్రహ్మాండమైన చిత్రాలను వెండితెరపై ఆవిష్కరించారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన 2.ఓ చిత్రంతో హాలీవుడ్‌ చిత్రాలకు ఏ మాత్రం తమిళులు తగ్గరని సవాల్‌ చేశారు. కాగా అలాంటి బ్రహ్మాండ చిత్రాల సృష్టికర్త శంకర్‌ సినీ పయనం 25 ఏళ్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తన శిష్యులతో కలిసి సరదాగా గడిపారు ఆదివారం ఉదయం స్థానిక చెన్నైలోని దర్శకుడు మిష్కన్‌ కార్యాలయంలో దర్శకుడు శంకర్‌తో పాటు ఆయన శిష్యులు వసంతబాలన్, బాలాజీశక్తివేల్, అట్లీ కలిసి సరదాగా గడిపారు. కాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం, గౌతమ్‌మీనన్, లింగుసామి, శశి, పా.రంజిత్, పాండిరాజ్, మోహన్‌రాజా కూడా శంకర్‌ ఆనందంలో పాలు పంచుకున్నారు. అందరూ కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.
 

మరిన్ని వార్తలు