పెరియ మనుషన్‌ ఏమయ్యాడు?

9 Aug, 2018 00:44 IST|Sakshi
రజనీకాంత్‌

‘‘భేష్‌.. సినిమా బాగుంది. రైట్‌ స్క్రిప్ట్‌ తీసుకొస్తే నీ డైరెక్షన్‌లో సినిమా చేస్తా’’... శంకర్‌కి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ‘జెంటిల్‌మేన్‌’ చూసి శంకర్‌కి రజనీ ఈ ఆఫర్‌ ఇచ్చారు. శంకర్‌కి దర్శకుడిగా ఇది ఫస్ట్‌ మూవీ. రజనీ ఇచ్చిన ఆఫర్‌తో ఉత్సాహంగా కథ రాయడం మొదలుపెట్టారు. అది రాస్తూనే ‘ప్రేమికుడు’ సినిమా తీయడం మొదలుపెట్టారు. ఈ సినిమా పూర్తయ్యేసరికి రజనీ కోసం తయారు చేసిన కథ కూడా పూర్తయింది. ‘పెరియ మనుషన్‌’ అని టైటిల్‌ కూడా పెట్టేశారు. అంటే పెద్ద మనిషి అని అర్థం. ఇక రజనీ కథ వినడమే ఆలస్యం. ‘పెరియ మనుషన్‌’ పట్టాలెక్కేస్తాడు.

అయితే అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని జరగవు కొన్ని అనే సామెతలా రజనీతో తీయాలనుకున్న ఈ ప్రాజెక్ట్‌ మొదలు కాలేదు. ఎందుకంటే, రజనీ అప్పటికి వేరే సినిమాలకు డేట్స్‌ ఇచ్చేశారు. ఇది జరిగింది 1993లో. ఆ తర్వాత 14 ఏళ్లకు ‘శివాజీ’ (2007)తో రజనీ–శంకర్‌ కాంబినేషన్‌ కుదిరింది. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘రోబో’తో ఇద్దరూ మరో ఘనవిజయం ఇచ్చారు. ఈ చిత్రం సీక్వెల్‌ ‘2.0’తో ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్‌ కుదిరింది. ‘2.0’ నవంబర్‌ 29న విడుదల కానుంది. అంతా బాగానే ఉంది. ఇంతకీ ఆ ‘పెరియ మనుషన్‌’ స్క్రిప్ట్‌ ఏమైంది? అంటే.. ఆ కథనే శంకర్‌ అటూ ఇటూ మార్చి కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు’ తీశారని టాక్‌.

మరిన్ని వార్తలు