దిల్వాలే దుల్హనియా లేజాయేంగే @ 20

20 Oct, 2015 08:56 IST|Sakshi
దిల్వాలే దుల్హనియా లేజాయేంగే @ 20

మామూలుగా ఓ సినిమా వంద రోజులు ఆడితే హిట్. అదే సినిమా 150 రోజులు ఆడితే సూపర్ హిట్, అంతకు మించి ఆడితే బ్లాక్ బస్టర్. అలాంటిది ఓ సినిమా ఏకంగా 20 సంవత్సరాల పాటు ఒకే థియేటర్లో ఆడితే.. అలాంటి సినిమాను చరిత్ర అంటారు. అలా వెండితెర మీద ఆవిష్కరించబడిన అద్భుతమే దిల్వాలే దుల్హనియా లేజాయేంగే. 1995 అక్టోబర్ 20న రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ లవ్స్టోరీ ఇప్పటికీ ముంబై మరాఠా మందిర్ రోజూ ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకుల ఆదరిస్తూనే ఉన్నారు.

షారూక్ ఖాన్, కాజోల్ హీరో హీరోయిన్లుగా అనుపమ్ ఖేర్, అమ్రీష్ పూరి లాంటి మహానటులు నటించిన ఈ సినిమాను ఆదిత్య చోప్రా తొలిప్రయత్నంగా డైరెక్ట్ చేశాడు. ఎటువంటి అనుభవం లేకపోయిన భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే అద్భుత ప్రేమకథను వెండితెర మీద ఆవిష్కరించాడు. అందుకే ఏకంగా పది ఫిలిం ఫేర్ అవార్డ్లతో పాటు బెస్ట్ పాపులర్ ఫిలింగా నేషనల్ అవార్డ్ కూడా సాధించింది దిల్వాలే దుల్హనియా లేజాయేంగే.

దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ఇచ్చిన ఇన్సిపిరేషన్తో ఇప్పటికీ ఇదే లైన్తో ఇండియన్ సినిమాలో ఎన్నో చిత్రాలు తెరకెక్కుతూనే ఉన్నాయి. మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇంతటి ఘనవిజయం సాధించిన దిల్వాలే దుల్హానియా లేజాయేంగే 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ ఓ స్పెషల్ వీడియో రూపొందించింది. ఈ వీడియోను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు షారూఖ్. మరోసారి కాజోల్ తో కలిసి దిల్వాలే సినిమాలో నటిస్తున్న షారూఖ్, డిడిఎల్ తరహాలోనే రూపొందించిన పోస్టర్ను ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశాడు.