ఈ సినిమా కొనాలనుకున్నా – శర్వానంద్‌

23 Mar, 2018 00:24 IST|Sakshi
కృష్ణ విజయ్, నారా రోహిత్, సురేష్‌ బొబ్బిలి, శర్వానంద్, శ్రీ విష్ణు, వేణు ఊడుగుల

‘‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్‌ చూడగానే మార్నింగ్‌ షో చూడాలనిపించింది. ఈ సినిమాను నేను కొనుక్కుంటే బావుంటుందనిపించి విజయ్‌కి కాల్‌ చేస్తే, అప్పటికే బిజినెస్‌ పూర్తయ్యింది. మంచి సినిమాను మిస్‌ చేసుకున్నానే అనిపిస్తోంది’’ అన్నారు హీరో శర్వానంద్‌. శ్రీ విష్ణు, సాట్నా టైటస్‌ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది.

ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో దర్శకుడు దేవీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘చాలామంది అడిగినా నటించలేదు. ఈ కథ నచ్చి, చేశా. హీరో తర్వాత అంత ఎమోషన్స్‌ ఉన్న క్యారెక్టర్‌ నాదే’’ అన్నారు. ‘‘కథ విన్నప్పుడు ‘ఏంట్రా ఇదేదో నా స్టోరీలాగే ఉందే’ అనిపించింది. నా జీవితాన్ని ఎప్పుడైనా సినిమాగా చూసుకోవాలంటే ఈ చిత్రం చూసుకోవచ్చని చేశా. ఒక అమ్మాయి వెంటపడి ప్రేమ కోసం ఒప్పించేటప్పుడు.. జీవితం కోసం ఎంత ఒప్పించాలని చెప్పేదే ఈ సినిమా’’ అన్నారు శ్రీ విష్ణు.

‘‘ఈ చిత్రం ట్రైలర్‌ చూడగానే పెద్ద హిట్‌ అవుతుందనే వైబ్రేషన్‌ కలిగింది. ‘ఆకలిరాజ్యం’ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ గుర్తుండిపోయింది. మరోసారి ఆ చిత్రాన్ని గుర్తుకు తెచ్చిన సినిమా ఇది’’ అని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి అన్నారు. నారా రోహిత్‌ మాట్లాడుతూ – ‘‘ఇంటర్‌ చదివే రోజుల్లో నా ఫ్రెండ్‌ బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ అవ్వాలనుకుంటే ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయ్యాడు. అలాంటివాళ్ల గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా