పవిత్రంగా ప్రేమిస్తే బావుంటుంది

26 Feb, 2014 22:47 IST|Sakshi
పవిత్రంగా ప్రేమిస్తే బావుంటుంది
 ‘‘నేను యువకుడిగా ఉన్నప్పటి సంఘటనలన్నీ ఈ కథ వింటుండగా గుర్తుకొచ్చాయి. పవిత్రంగా ప్రేమిస్తే బావుంటుందనేది ఈ సినిమా కాన్సెప్ట్’’ అని చిత్ర సమర్పకుడు కేయస్ రామారావు చెప్పారు. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సీసీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి పీవీపి ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, రఘురామరాజు క్లాప్ ఇచ్చారు. రమేష్‌ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. 
 
 ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ -‘‘కథ చాలా బావుంది. సాయిమాధవ్ చాలా గొప్ప డైలాగులు రాశారు’’ అన్నారు. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదని దర్శకుడు పేర్కొన్నారు. బొంబాయిలాంటి ఫీల్ ఉన్న సినిమా ఇదని నిత్యామీనన్ అన్నారు. సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ -‘‘ ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తర్వాత నన్ను నేను నిరూపించుకునే సినిమా ఇది. ఈ భూమ్మీద ఎంత పాతబడినా కొత్తగా అనిపించే అంశాలు రెండు. ఒకటి మానవుడు. రెండు ప్రేమ. ఈ సినిమాలో ప్రేమను కొత్తగా చూపిస్తున్నాం’’ అని చెప్పారు. మంచి టీమ్‌తో పని చేస్తున్నానని నాజర్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: తమ్ముడు సత్యం.
 
>