అదే మాకు పెద్ద సక్సెస్‌

9 Feb, 2020 00:17 IST|Sakshi
శర్వానంద్

‘‘ఒక నటుడిగా నేను బాగానే చేస్తున్నానంటున్నారు కానీ రావాల్సిన పేరు ఇంకా మనకు రాలేదా? అనే ఒక చిన్న వెలితి ఉండేది. ‘జాను’ చిత్రం యాక్టర్‌గా నన్ను మెరుగుపరిచింది. నా కెరీర్‌లోనే ఎప్పుడూ రానన్ని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విజయం యాక్టర్‌గా నా ఆకలిని కొంచెం తీర్చింది’’ అన్నారు శర్వానంద్‌. సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో శర్వానంద్, సమంత ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళంలో హిట్‌ సాధించిన ‘96’ చిత్రానికి ఇది రీమేక్‌. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమా వేశంలో శర్వానంద్‌ చెప్పిన విశేషాలు.

► ‘96’ చూసి క్లాసిక్‌ మూవీ, తెలుగు రీమేక్‌ అవసరమా? అనిపించింది. ‘శతమానం భవతి’(2017) సినిమా సమయంలో కూడా ‘కథ బాగుంది కాకపోతే నా పాత్ర అంతగా ఉన్నట్లు లేదు’ అనే సందేహం వచ్చినప్పుడు.. ఈ సినిమాతో ఫ్యామిలీకి దగ్గరవుతావు’ అన్న ‘దిల్‌’ రాజుగారి జడ్జ్‌మెంట్‌ నిజమైంది. ‘జాను వర్కౌట్‌ అవుతుంది’ అని అన్నారాయన. ఆ నమ్మకంతోనే నటించాలనుకున్నాను. ‘దిల్‌’ రాజుగారు నిర్మాత కాకపోతే గ్యారంటీగా ‘జాను’ చిత్రం చేసేవాడిని కాను.

► ఒక రోజు రాత్రి జరిగే కథ. ఓ నలభై రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందిలే అనుకున్నా. కానీ రామచంద్ర క్యారెక్టర్‌ కళ్లతోనే ఎక్కువగా మాట్లాడాలి. ఇరవై రోజులు కెన్యాలో షూట్‌ చేశాం. మాల్దీవుల్లో చేశాం. ఓ సీన్‌లో గాయపడ్డాను. మరోవైపు కో–స్టార్‌గా సమంత. రిలీజ్‌ తర్వాత మా ఇద్దరి యాక్టింగ్‌కు పోలికలు పెట్టి ట్రోల్‌ చేస్తారేమోనన్న భయం. కానీ నా కెరీర్‌లోనే నేను బాగా కష్టపడ్డ సినిమా ‘జాను’. సమంత కాకుండా వేరే ఎవరైనా ‘జాను’ పాత్ర చేసినా నా నుంచి అంత నటన వచ్చి ఉండేది కాదేమోనని ఒక యాక్టర్‌గా నేను అనుకుంటున్నాను. ‘96’లో చేసిన విజయ్‌సేతుపతి, త్రిషలను మర్చిపోయి ‘జాను’లో శర్వా, సమంతలను చూస్తున్నాం అంటున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్‌.

► వ్యక్తిగా, నటుడిగా సమంత నుంచి చాలా నేర్చుకున్నాను. ‘నేనొక సూపర్‌స్టార్‌.. నేను అక్కినేని ఫ్యామిలీ’ అనే గర్వం తనలో లేదు. నేనొక షాట్‌ పూర్తి చేసి వెళ్లి కూర్చొంటే... సమంత మాత్రం మానిటర్‌ దగ్గరకు వెళ్లి చెక్‌ చేసుకునేది. ఇప్పుడు ఆ ఫార్ములాను నా సెట్‌లో నేను వాడుతున్నాను. రిలీజ్‌ తర్వాత మేం ఫోన్లో మాట్లాడుకున్నాం. ‘సైలెంట్‌గా ఉంటావ్‌ కానీ బాగానే మార్కులు కొట్టేశావ్‌.. నువ్వు దొంగవి’ అంది సమంత.

► ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్‌ లవ్‌ ఉంటుంది. నాకు కూడా ఉంది కాబట్టే రామచంద్ర పాత్రలో బాగా నటించానేమో (నవ్వుతూ). ఫస్ట్‌ లవ్‌ను పెళ్లి చేసుకునేవారు చాలా తక్కువ. 100లో 5 పర్సెంట్‌ ఉంటారేమో.

► నా కెరీర్‌లో ‘గమ్యం, ప్రస్థానం’ వంటి మంచి హిట్స్‌ ఉన్నాయి. కానీ ‘జాను’ లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. నా కెరీర్‌లో ‘జాను’ గుర్తుండిపోయే సినిమా.

► తక్కువ రోజుల్లోనే షూట్‌ను కంప్లీట్‌ చేద్దామనే అక్షయ్‌కుమార్‌ ఫార్ములాను ఫాలో అవుదామని ఫిక్స్‌ అయ్యాను. 3 సినిమాలు అయిపోవాలి.. 3 సెట్స్‌పై ఉండాలి. ‘శ్రీకారం’లో రైతు పాత్ర చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 24న విడుదల చేస్తున్నాం.

మరిన్ని వార్తలు