ఒక జానర్‌కి ఫిక్స్‌ అవ్వను

18 Aug, 2019 00:07 IST|Sakshi
శర్వానంద్‌

‘‘ఒక జానర్‌కి, ఒక స్టైల్‌కి ఫిక్స్‌ అవడానికి ఇష్టపడను. సినిమా సినిమాకు జానర్స్‌ మార్చుకుంటూ వెళ్లడానికి ఇష్టపడతాను. ప్రతి స్క్రిప్ట్‌ విభిన్నంగా ఉండాలి. ఎప్పుడూ ఒకటే చేసుకుంటూ వెళ్తే ఆడియన్స్‌కు బోర్‌ కొట్టేస్తాం’’ అన్నారు శర్వానంద్‌. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా,  కల్యాణీ ప్రియదర్శన్, కాజల్‌ అగ ర్వాల్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం గత గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా శర్వానంద్‌ చెప్పిన విశేషాలు.

► సినిమాకు వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ బావుంది. రిలీజ్‌ రోజు ఉదయం డివైడ్‌ టాక్‌ వచ్చింది. తర్వాత యావరేజ్‌ అన్నారు. ఇప్పుడు ఎబౌ యావరేజ్‌ అంటున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ కూడా బాగాలేదు అనడం లేదు. ‘చాలా బావుంటుంది’ అంటారనుకున్నాం. ఈ రిజల్ట్‌ ఊహించలేదు. రివ్యూలు ఒకలా ఉన్నాయి. ప్రేక్షకులు చెబుతున్నది ఒకలా ఉంది. ఏం జరిగిందో అని విశ్లేషించుకుంటున్నాను. ఒక విధంగా హ్యాపీగా ఉంది. ఇంకో విధంగా చిన్న అసంతృప్తి. కలెక్షన్స్‌ పరంగా సూపర్‌ హ్యాపీ. రివ్యూలు కూడా ఇంకొంచెం బావుంటే కలెక్షన్స్‌ ఇంకా బావుండేవేమో? అని చిన్న ఆశ (నవ్వుతూ).

► విమర్శ అనేది ప్రతి ఆర్టిస్ట్‌కు అవసరం. అది విలువైనది అయితే దాన్ని తీసుకొని మనల్ని మనం మెరుగుపరచుకోవాలి. ఫ్యామిలీ సినిమాలు, కామెడీ సినిమాలు చేశాను. జానర్‌ మార్చుదామని ఈ సినిమా చేశాను. సుధీర్, నేను ఓ స్టైలిష్, యాక్షన్‌ సినిమా చేయాలనుకున్నాం. సినిమాలో స్క్రీన్‌ప్లే నాకు బాగా నచ్చింది. రెండుషేడ్స్‌ ఉన్న పాత్రలు ఉన్నాయి. యాక్టర్‌గా చాలెంజింగ్‌గా ఉంటుందనిపించింది. ‘ప్రస్థానం. రన్‌ రాజా రన్‌’ సినిమాల తర్వాత ‘ప్రతి ఫ్రేమ్‌లో బావున్నాను’ అని ఈ సినిమాకు అనిపించింది.

► సినిమాలో ఓల్డ్‌ లుక్‌కి కష్టపడలేదు. ఆ గెటప్‌ వేయగానే హుందాతనం వచ్చింది. యంగ్‌ లుక్‌లో నేను చిరంజీవి ఫ్యాన్‌లా నటించాను. ‘ఘరానా మొగుడు, అల్లుడా మజాకా’ సినిమాల్లో మేనరిజమ్స్‌ని నా స్టైల్లో ఇమిటే ట్‌ చేశాను.

► ‘మాకు మంచి సినిమా తీసి ఇవ్వండి’ అన్నారు నిర్మాత చినబాబు గారు. సినిమా కోసం నాగవంశీ కూడా చాలా కష్టపడ్డాడు. ఈ బ్యానర్‌ నుంచి మంచి సినిమాలే వస్తాయి. కుదిరితే ఈ బ్యానర్‌లో మళ్లీ చేస్తా.

► నెక్ట్స్‌ ‘96, శ్రీకారం’ సినిమాలు చేస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను. ‘96’ షూటింగ్‌ సగం వరకూ వచ్చింది.


► ‘రణరంగం’కి వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఏంటంటే సురేఖ ఆంటీ (చిరంజీవి సతీమణి) ఫోన్‌ చేసి ‘చాలా అందంగా ఉన్నావు. ఎంత బావున్నావో. 80స్‌ లుక్‌ భలే కుదిరింది’ అన్నారు. నాక్కూడా పర్సనల్‌గా సినిమాలో ఆ లుక్‌ చాలా ఇష్టం.  

► ప్రేక్షకుడికి కొత్త కథను ఇవ్వాలంతే. కచ్చితంగా చూస్తారు. కథను ఎంత చక్కగా చెప్పగలం అన్నదే ముఖ్యం. ఈ ప్రాసెస్‌లో మేం (యాక్టర్స్‌) కూడా చాలా నేర్చుకుంటున్నాం. కొన్ని సినిమాలు వర్కౌట్‌ అవుతాయి. కొన్ని అవ్వవు. మా సినిమా చూడలేదంటే అది వాళ్ల తప్పు కాదు. మన తప్పు ఉంది. మంచి కథలు ఎంచుకుంటూ వాళ్లను ఎంటర్‌టైన్‌ చేయాలి. మంచి కథలు చెబుతూ, ‘యాక్టర్‌గా అన్నీ చేయగలడు’ అనిపించుకోవాలనుకుంటున్నాను.

మరిన్ని వార్తలు