ఆ బాధలోంచి పుట్టుకొచ్చిన కథ ఇది!

8 Feb, 2017 23:52 IST|Sakshi
ఆ బాధలోంచి పుట్టుకొచ్చిన కథ ఇది!

‘‘శతమానం భవతి’ కథను తొలుత సాయిధరమ్‌ తేజ్, రాజ్‌ తరుణ్‌కి వినిపించాం. వాళ్లకు నచ్చింది. వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కథాంశం కావడంతో ఎలాగైనా పండగకి విడుదల చేయాలనుకున్నాం. ఈ పాత్రకు శర్వానంద్‌ సరిపోతాడనిపించి, కథ వినిపించాం. తనకు కథ నచ్చి, అంగీకరించారు’’ అన్నారు దర్శకుడు సతీష్‌ వేగేశ్న. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ‘శతమానం భవతి’ ఈ సంక్రాంతికి విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు పలు విశేషాలు పంచుకున్నారు.

పదిహేడేళ్ల కింద ఉద్యోగ రీత్యా సంక్రాంతి పండుగ అప్పుడు మా అమ్మానాన్నలను మిస్‌ అయ్యాను. చాలా బాధ అనిపించింది. అప్పుడు ‘పల్లె పయనమెటు’ అని ఓ షార్ట్‌ స్టోరీ రాశా. ‘కబడ్డీ కబడ్డీ’ క్లయిమాక్స్‌ టైమ్‌లో జగపతిబాబుగారికి చెబితే నేను ప్రొడ్యూస్‌ చేస్తా, షార్ట్‌ ఫిలిం తీద్దామన్నారు. ఆ స్టోరీతో ఫీచర్‌ ఫిల్మ్‌ తీయొచ్చు కదా అన్న నా మిత్రుల సలహా మేరకు ‘దిల్‌’ రాజుగారిని కలిసి, స్టోరీ లైన్‌ వినిపించా. డెవలప్‌ చేయమన్నారు. ఏడాదిన్నర టైమ్‌ తీసుకుని ‘శతమానం భవతి’ కథ తయారు చేశా.

♦  రచయితగా, దర్శకుడిగా నాపై ఈవీవీ సత్యనారాయణగారి ప్రభావం ఉంది. సినిమాను సినిమాగానే చూడాలి. చిన్నదా? పెద్దదా? అనే తేడా ఉండకూడదని చెప్పేవారాయన. స్క్రిప్ట్‌ రెండు మూడు సార్లు చదివి, కరెక్షన్స్‌ ఫైనల్‌ చేశాకే షూటింగ్‌ మొదలు పెట్టేవారు. అందుకే ఈవీవీగారు త్వరగా షూటింగ్‌ పూర్తి చేసేవారు.

దర్శకుడిగా నా మొదటి సినిమా ‘దొంగలబండి’ హిట్‌ కాలేదు. కథ మనకు నచ్చేలా కాదు.. ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని ఆ ఓటమి నాకు పాఠం నేర్పింది. రచయితగా నలభై సినిమాలకు పని చేసిన నాకు డైరెక్టర్‌గా ‘లైఫ్‌ అండ్‌ డెత్‌’ అనుకుని ‘శతమానం భవతి’ చేశా. మా నమ్మకాన్ని ప్రేక్షకులు వమ్ము చేయకుండా ఆదరించారు.

‘శతమానం భవతి’ కథ కొత్తది కాకున్నా, సన్నివేశాలు కొత్తగా అనిపిస్తున్నాయి. మా చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఇది నా కథ అని ఎక్కడో ఒక చోట ఫీలయ్యారు. మా చిత్రం బాగుందని దర్శకులు కె.విశ్వనాథ్, దాసరి, రాఘవేంద్ర రావుగార్లు అభినందించడం మరచిపోలేను. ఈ విజయం నా బాధ్యత మరింత పెంచింది.  

తరాలు మారినా ఎమోషన్స్‌ మారవు. కమర్షియల్‌ సినిమాకు కథ త్వరగా రాయొచ్చు. కానీ, ఎమోషన్స్‌తో కూడిన కథ రాయడానికి టైమ్‌ పడుతుంది.

నా తర్వాతి ప్రాజెక్ట్‌ ‘దిల్‌’ రాజుగారి బ్యానర్‌లోనే ఉంటుంది. త్వరలో పూర్తి వివరాలు చెబుతాం.