ఆయనగా మారిన ఆవిడ!

28 May, 2014 23:30 IST|Sakshi
ఆయనగా మారిన ఆవిడ!

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి మనందరికీ సుపరిచితురాలే. సతీ సావిత్రి అంతటి మహాపతివ్రతలాంటి పాత్రలను ఎంత అద్భుతంగా చేయగలరో, ‘డర్టీ’ కేరక్టర్లను కూడా అంతే బ్రహ్మాండంగా చేయగలరు. ఆ తార విద్యాబాలన్ అని ఈ చిన్న క్లూతో కనిపెట్టేసి ఉంటారు. ప్రస్తుతం విద్యా నటిస్తున్న చిత్రాల్లో ‘బాబీ జాసూస్’ ఒకటి. ఇందులో డిటెక్టివ్ బాబీగా చేస్తున్నారు విద్యా. నంబర్ వన్ డిటెక్టివ్ అనిపించుకోవాలన్నదే బాబీ ధ్యేయం. అందుకోసం రకరకాల వేషాలు మార్చుతుంది. ఓ కేసుని ఛేదించడానికి రైల్వే స్టేషన్‌లో యాచకురాలి అవతారం ఎత్తుతుంది బాబీ.
 
 మరోసారి ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్నట్లు, ఎత్తు పళ్లతో మగాడి అవతారంలో కనిపిస్తుంది. ఇలా ఈ సినిమాలో విద్యా బోల్డన్ని అవతారాల్లో ప్రత్యక్షమై ఆశ్చర్యపరచనున్నారు. విద్యా ఒక పాత్రలో ఏ స్థాయిలో పరకాయ ప్రవేశం చేస్తారో ఇప్పటివరకు చేసిన చిత్రాలు తెలియజేశాయి. ‘బాబీ జాసూస్’ మరోసారి నిరూపించనుంది. ఇంకా చెప్పాలంటే.. ఆహార్యం పరంగా విద్యా ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నీ ఓ ఎత్తయితే, ఈ చిత్రం మరో ఎత్తు అవుతుందనొచ్చు. జూలై 4న ఈ సినిమా విడుదల కానుంది.

>