ఆ మాట వినగానే నాన్న షాక్‌ అయ్యారు

18 Feb, 2020 04:38 IST|Sakshi

‘‘నచ్చావులే’ సినిమా నుంచి నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ‘సవారి’ పాటల్ని పెద్ద హిట్‌ చేశారు. ముఖ్యంగా ‘నీ కన్నులు..’ పాట ఇప్పటికే 10 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఈ పాటతో టిక్‌ టాక్‌లో కొన్ని లక్షల వీడియోలు చేశారు. ఈ పాట పాడిన రాహుల్‌ సిప్లిగంజ్, రాసిన కాసర్ల శ్యామ్‌గార్లకు థ్యాంక్స్‌’’ అన్నారు సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర. ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం ‘వలయం’ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదల చేసిన ‘నిన్ను చూశాకే..’ పాటకి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా శేఖర్‌ చంద్ర చెప్పిన విశేషాలు.
►మా నాన్నగారు (హరి అనుమోలు) కెమెరామేన్‌. నేను మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతాను అన్నప్పుడు ఆయన షాకయ్యారు. సినిమాటోగ్రఫీ అంటే ఫర్వాలేదు కానీ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అంటే చాలా రిస్క్‌ అన్నారు. కొన్ని సినిమాలు చేశాక వాటికి వచ్చిన స్పందన చూసి ఆయనకి నమ్మకం కుదిరింది.
►నేను సంగీత దర్శకుడు కావడానికి స్ఫూర్తి కీరవాణి, ఏ.ఆర్‌.రెహమాన్‌గార్లు. నేను చిత్రపరిశ్రమకి వచ్చి 14 ఏళ్లు అయింది. ఇప్పటి వరకూ దాదాపు 35 సినిమాలు చేశాను. నా కెరీర్‌ చాలా కూల్‌గా వెళ్తోంది. నా పాటలకు మంచి స్పందన వస్తోంది. వాటిని ఎక్కువగా టిక్‌ టాక్‌లు చేస్తూ  వైరల్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగులో సాధించాల్సింది చాలా ఉంది. ఆ తర్వాత ఇతర భాషల గురించి ఆలోచిస్తా. 
►నేను ఇప్పటి వరకూ చేసిన పెద్ద సినిమా కల్యాణ్‌ రామ్‌గారి ‘118’ . అందులో ఒకే ఒక్క పాట ఉంటుంది.. అది పెద్ద చాలెంజ్‌. ఆ సినిమాలో ఉన్న ఆ ఒక్క పాటకి న్యాయం చేయగలనా? అని భయం వేసింది. అందులోనూ అది థ్రిల్లర్‌ సినిమా. అయితే ‘చందమామే..’ అనే పాట చాలా పెద్ద హిట్‌ అయ్యింది. నా కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాట అని కల్యాణ్‌ రామ్‌గారు అభినందించడం మరచిపోలేను. 
►పెద్ద హీరోల సినిమాలు చేయడం లేదనే భావన ఉంది. నేను చేసేవి చిన్న సినిమాలు అయినప్పటికీ.. కొత్త కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు. దీంతో ఫ్రెష్‌ మ్యూజిక్‌ ఇవ్వగలుగుతున్నాను. పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు కదా? ప్రేమ కథా చిత్రాలు చేయడం వల్ల మంచి మెలోడీస్, థ్రిల్లర్స్‌ చేయడం వల్ల చక్కని నేపథ్య సంగీతం ఇచ్చే అవకాశం ఉంటుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు