ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రయత్నం మానలేదు : శిల్పా శెట్టి

20 May, 2019 09:33 IST|Sakshi

నటి శిల్పా శెట్టి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటే.. సెలబ్రిటీ బిగ్‌ బ్రదర్‌ షో ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్‌లో దాదాపు 40 చిత్రాల్లో నటించారు శిల్పా శెట్టి. ‘17వ ఏట సినిమాల్లో అడుగుపెట్టాను. ప్రపంచం గురించి, జీవితం గురించి నాకు ఏ మాత్రం అవగాహన లేదు. కానీ ధైర్యంగా ముందుకు వెళ్లడం మాత్రమే చేశానం’టూ చెప్పుకొచ్చారు శిల్పా శెట్టి. హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబేకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆమె మాటల్లోనే.. ‘1993లో వచ్చిన బాజీగర్‌ చిత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. నన్ను టాప్‌ హీరోయిన్‌ని చేసింది. సినిమాల్లో నటించాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సరదాగా ఒక ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నాను. అప్పుడు ఓ ఫోటోగ్రాఫర్‌ నా ఫోటోలు తీశాడు. అతనేదో ఊరికే అడగుతున్నాడు అనుకున్నాను. కానీ నిజంగానే నా ఫోటోలు తీశాడు.. అది కూడా చాలా అందంగా. దాంతో నాకు మోడలింగ్‌ అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో చాన్స్‌ రావడం.. ఆ తర్వాత మరి ఇక నేను వెను తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలా ఎంతో ముందుకు.. ఎత్తుకు వెళ్లాను’ అంటూ చెప్పుకొచ్చారు.

‘17 ఏళ్ల వయసు అంటే ప్రపంచం గురించే కాదు జీవితం గురించి కూడా సరైన అవగాహన ఉండదు. కానీ అంత చిన్న వయసులోనే ఓ సెలబ్రిటీని కావడం.. సక్సెస్‌ఫుల్‌గా రాణించడం జరిగిపోయాయి. కానీ అప్పటికి నేనింకా వీటికి తయారుగా లేను. ఇక పోతే నాకు హిందీ రాదు. దాంతో కెమరా ముందు నిల్చోవాలంటేనే ఒణుకు వచ్చేద’ని చెప్పుకొచ్చారు. 2007లో వచ్చిన ‘ఆప్నే’ శిల్పా శెట్టి నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత ఆమె సినిమాల్లో కనిపంచలేదు. ఈ విషయం గురించి ఆమె ‘ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఒక సందర్భం వస్తుంది’ అన్నారు. ‘నేను నటించిన సినిమాల్లో కొన్ని మంచి విజయం సాధించాయి. అయినా కూడా నేను ఇంకా వెనకబడి ఉన్నాననే అనుకునేదాన్ని. మరింత కష్టపడాలని భావించేదాన్ని’ అన్నారు.

అంతేకాక ‘ఓ చిత్రం విజయం సాధించినప్పుడు సెలబ్రేట్‌ చేసుకోవడం.. మరో చిత్రం ఫెయిల్‌ అయనప్పుడు బాధపడుతూ మర్చి పోవడానికి ప్రయత్నించడం అనే విషయాలు అంత తేలికైనవేం కాద’న్నారు. అంతేకాక ‘కొన్ని సార్లు సరైన కారణం చెప్పకుండానే నిర్మాతలు తమ సినిమాల నుంచి నన్ను తొలగించేవారు. వారి పేర్లు కూడా నాకు గుర్తు ఉన్నాయి. ఇప్పుడు వాటిని బయట పెట్టడం కూడా అనవసరం. అయితే అలా జరగినప్పుడు ప్రకృతి నాకు వ్యతిరేకంగా పని చేస్తుందని అనుకునేదాన్ని.  కానీ ప్రయత్నించడం మాత్రం ఆపలేదు’ అన్నారు.

ఇక ప్రముఖ బ్రిటీష్‌ రియాలిటీ షో ‘సెలబ్రిటీ బిగ్‌ బ్రదర్‌ సీజన్‌ 5లో పాల్గొనడం నిజంగా తన అదృష్టం అన్నారు. ‘ఆ షో నా మీద చాలా ప్రభావం చూపించింది. ఎందుకంటే ఈ ప్రొగ్రాంలో నా దేశం మూలంగా నేను బహిరంగ అవమానానికి, వివక్షకు గురయ్యాను. కానీ షోలో గెలిచిన తర్వాత చాలా మంది ‘మమ్మల్ని గర్వపడేలా చేశావం’టూ మెచ్చుకున్నారు. ‘జీవితంలో కొన్ని సార్లు చాలా క్లిష్ట పరిస్థితులు చూశాను.. మరి కొన్ని సార్లు ఎంతో మధుర క్షణాలు చూశాను. కానీ ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాను. ఫలితం ఈ రోజు నేనొక బలమైన స్వతంత్ర మహిళగా, యాక్టర్‌గా, భార్యగా, తల్లిగా మీ ముందు ఇలా నిల్చున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. శిల్పా 2009లో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను వివాహం చేసుకున్నారు. వీరికొక బాబు వియాన్‌.

మరిన్ని వార్తలు