ఆ నలుగురి వల్లే ఈ స్థాయికి ఎదిగా

11 Apr, 2017 23:24 IST|Sakshi
ఆ నలుగురి వల్లే ఈ స్థాయికి ఎదిగా

 – లారెన్స్‌
‘‘నేను చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగా. అందుకు కారణం మా అమ్మగారు, ఆ రాఘవేంద్రస్వామి, ఇండస్ట్రీలో నాకు డ్యాన్సర్‌ స్థానాన్ని కల్పించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారు, నన్ను కొరియోగ్రాఫర్‌ని చేసిన చిరంజీవిగారు. ఈ నలుగురుకీ నా కృతజ్ఞతలు’’ అని రాఘవా లారెన్స్‌ అన్నారు. నృత్యదర్శకుడిగా, దర్శకుడిగా, నటుడిగా లారెన్స్‌ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రస్తుతం రాఘవా లారెన్స్, రితికా సింగ్‌ జంటగా పి.వాసు దర్శకత్వంలో అభిషేక్‌ ఫిలింస్‌ పతాకంపై రమేష్‌ పి.పిళ్లై తమిళ్, తెలుగు భాషల్లో నిర్మించిన ‘శివలింగ’ ఈ శుక్రవారం విడుదల కానుంది.

సురక్ష్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై మల్కాపురం శివకుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. మంగళవారం జరిగిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో లారెన్స్‌ మాట్లాడుతూ –‘‘శివలింగ’ చిత్రం కన్నడలో హిట్‌ అయింది. అందులో శక్తీ వాసు నటన చూసి, క్యారెక్టర్‌లో కొన్ని మార్పులు చేస్తే ఇంకా బాగుంటుందనగానే వాసుగారు మార్పులు చేశారు. తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది’’ అన్నారు.

‘‘మా చిత్రం జనవరిలో విడుదల కావాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. లేటైనా, లెటెస్ట్‌గా వస్తున్నాం’’ అని పి.వాసు చెప్పారు. ‘‘వాసు దర్శకత్వ ప్రతిభ గురించి కొత్తగా మాట్లాడాల్సిన పనిలేదు. లారెన్స్, రితికా నటన ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మల్కాపురం శివకుమార్‌. నటుడు శక్తీ వాసు, రితికా సింగ్, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ పాల్గొన్నారు.