అలాంటి నిర్మాతలు అవసరం

17 May, 2019 00:09 IST|Sakshi
పద్మనాభరెడ్డి, వీవీ వినాయక్, నాగ ప్రభాకరన్‌

– వీవీ వినాయక్‌

‘‘శివరంజని’ టైటిల్‌ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌ చాలా బాగుంది. ఇప్పుడు వస్తోన్న హారర్‌ చిత్రాలకు భిన్నమైన కంటెంట్‌ ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు. రష్మి గౌతమ్, నందు జంటగా నందినీరాయ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శివరంజని’. నాగ ప్రభాకరన్‌ దర్శకత్వంలో యూ అండ్‌ ఐ ఎంటరై్టన్మెంట్స్‌ బ్యానర్‌లో ఎ. పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్ననాయుడు నిర్మించారు.

ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి చిన్న చిత్రాలకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. వీరికి మంచి విజయాలు వస్తే ఇలాంటి కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలు ఇంకా ఎక్కువగా షైన్‌ అవుతాయి’’ అన్నారు. నాగ ప్రభాకరన్‌ మాట్లాడుతూ–‘‘హారర్‌ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది.

ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ మధ్య నడిచే హారర్‌ ఎపిసోడ్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఊహించని కథ, కథనాలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రాన్ని జూన్‌ మొదటి వారంలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘శివరంజని’ తప్పకుండా నేటి ట్రెండ్‌ లో వస్తోన్న హారర్‌ చిత్రాల్లో భిన్నమైన సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. మా బ్యానర్‌ లో మంచి కాన్సెప్ట్స్‌ ఉన్న చిత్రాలు ఈ యేడాది మరిన్ని రాబోతున్నాయి’’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు