బాహుబలి విశేషాలు కావాలా..?

6 Jun, 2016 15:00 IST|Sakshi
బాహుబలి విశేషాలు కావాలా..?

తెలుగు సినీ చరిత్ర రికార్డులను తిరగరాసిన బాహుబలి సినిమా రెండో భాగం షూటింగ్ ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ భాగాన్ని షూట్ చేస్తున్నట్లు నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ తెలిపారు. ఈనెల 13 నుంచి 10 వారాల పాటు బాహుబలి రెండో భాగం క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా.. అంతా కలిసి అద్భుతంగా ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారంటూ బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌కు సంబంధించిన ఓ ఫొటోను కూడా ట్వీట్ చేశారు. రాజమౌళి, రమారాజమౌళి తదితర బృందం మొత్తం డిజైన్లు రూపొందిస్తున్న ఫొటోను షేర్ చేశారు. స్నాప్‌చాట్‌లో ఇక మీదట తాము అందుబాటులో ఉంటామని, సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. తమను ఫాలో అవడం ఎలాగో కూడా ట్విట్టర్‌లో వెల్లడించారు. తమన్నా కూడా ఇప్పటికే స్నాప్‌చాట్‌లో ఉందని తెలిపారు.

క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ కోసం జాతీయ అవార్డు విజేత అయిన ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రత్యేకంగా సెట్లను డిజైన్ చేశారు. ఆగస్టు నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి, అప్పటినుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా అయితే.. 2017 ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా దీన్ని విడుదల చేస్తారు.