'హేమ నా ఇంటికి దగ్గరే.. కానీ కలుసుకోలేదు'

16 Feb, 2016 18:39 IST|Sakshi
'హేమ నా ఇంటికి దగ్గరే.. కానీ కలుసుకోలేదు'

ముంబయి: దాదాపు 40 ఏళ్ల తరువాత.. అలనాటి సూపర్ డూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం 'షోలే' తారాగణమంతా ఒకే వేదికపై తళుక్కుమన్నారు. వారందరినీ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఏకం చేసింది. హేమమాలిని తొలి సంగీత ఆల్బమ్ 'డ్రీమ్ గర్ల్' ఆవిష్కరణ వారంతా ఒక వేదికపైకి రావడానికి అవకాశం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పీ తదితరులు హాజరయ్యారు.

'40 ఏళ్ల తరువాత హేమామాలిని మ్యూజిక్ ఆల్బమ్ షోలే చిత్ర సభ్యులను ఒకే చట్రంలోకి తీసుకొచ్చింది' అని అమితాబ్ మంగళవారం తన బ్లాగులో పోస్ట్ చేశారు. 'మా జట్టులోని సంజీవ్ కుమార్, అంజాద్ ఖాన్ మన మధ్యలో లేరు. సమయం ఎవరి కోసం ఆగదు. కానీ ఆ ఎదురుచూపులను గుర్తిస్తుంది. ధర్మేంద్ర, హేమమాలిని మా ఇంటికి దగ్గర్లోనే ఉంటారు. కానీ మేం ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ కార్యక్రమంలో ఇలా కలుసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది' అని అమితాబ్ అన్నారు.

ఈ ఆల్బమ్‌లోని 'అజీ సునియే జరా' అనే పాటను సంగీత దర్శకుడు బాబుల్ సుప్రియోతో కలిసి హేమమాలిని పాడింది. ఈ పాటలోని బిగ్ బిసే లేకే పాజి అనే పదాలు అమితాబ్, ధర్మేంద్రలను సూచిస్తాయి. 'కళలు, వినోదాలే నన్ను నడిపిస్తున్నాయి. అవి నాలో కలిసిపోయాయి. గతంలో నా గాన ప్రతిభను పరీక్షించుకోలేదు. ఇప్పుడు వినిపించేందుకు ఆత్రుతతో ఉన్నాను. గతంలోమాదిరిగానే ఈసారీ ఆదరిస్తారని భావిస్తున్నాను' అని హేమమాలిని అన్నారు. 1973లో కిశోర్ కుమార్ను చూసి స్ఫూర్తి పొందిన హేమ అప్పటి నుంచి సంగీత ఆల్బమ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.