త్వరలో పాక్లోనూ 'అరె ఓ సాంబా'

6 Feb, 2015 17:06 IST|Sakshi
త్వరలో పాక్లోనూ 'అరె ఓ సాంబా'

అరె ఓ సాంబా.. కిత్నే ఆద్మీ థే.. ఈ డైలాగులు ప్రపంచంలో హిందీ సినిమాలు చూసే ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పుడీ డైలాగులు త్వరలోనే పాకిస్థాన్లో కూడా ప్రతిధ్వనించనున్నాయి. అవును.. భారతదేశంలో విడుదలైన 40 ఏళ్ల తర్వాత ఇన్నాళ్లకు పాకిస్థాన్లో ఆ సినిమా విడుదల కాబోతోంది. అక్కడి సినీరంగానికి చెందిన ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తొలిసారిగా తమ దేశంలో కూడా షోలే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మాండ్వీవాలా ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ 2డి, 3డి వెర్షన్లలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించింది. రమేష్ సిప్పీ దర్శకత్వంలో, ఆయన తండ్రి జీపీ సిప్పీ నిర్మాతగా 1975లో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రేఖ, హేమ మాలిని, సంజీవ్ కుమార్, అంజాద్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు.

అయితే, ఇన్నాళ్లూ పాక్లో కేవలం పైరసీ వెర్షన్ మాత్రమే చూసేవారని, ఇప్పుడు తాము దాన్ని విడుదల చేస్తున్నామని మాండ్వీవాలా ఎంటర్టైన్మెంట్ అధినేత నదీమ్ మాండ్వీవాలా చెప్పారు. బాలీవుడ్ సినిమాలకు పాక్లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే అలనాటి ఈ క్లాసిక్ చిత్రాన్ని కూడా అందించబోతున్నారు.