లఘు చిత్ర దర్శకుడికి నాటా ఆహ్వానం

20 May, 2018 16:08 IST|Sakshi

లఘు చిత్రాలను రూపొందించి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న దర్శకుడు ఆనంద్‌ కుమార్‌కు మరో గౌరవం దక్కింది. ఈ ఏడాది జూలైలో జరగబోయే నాటా (నార్త్‌ అమెరికా తెలుగు అసోషియేషన్‌) మెగా కన్వెన్షన్‌లో దర్శకుడు ఆనంద్‌ కుమార్‌ పాల్గొననున్నారు. డాక్టర్‌ అయిన ఆనంద్‌ సినీరంగం మీద ప్రేమతో దర్శకుడిగా మారారు. హార్మోన్స్‌ సినిమాతో దర్శకుడి పరిచయం అయిన ఆనంద్‌, తరువాత లఘు చిత్రాలతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. సామాజిక సమస్యల నేపథ్యంలో ఆనంద్‌ రూపొందించిన  ప్రజా హక్కు, అన్‌ టచ్‌ ఎబిలిటీ లాంటి షార్ట్‌ ఫిలింస్‌కు విమర్శకుల నుంచి ప‍్రశంసలు దక్కాయి.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన 9 ఏళ్ల అమ్మాయి చిరు తేజ్‌ సింగ్ కథతో తెరకెక్కించిన షార్ట్‌ ఫిలిం ఆనంద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించటంతో పాటు పలు అవార్డు కమిటీల జ్యూరీలలో మెంబర్‌గా ఉన్న ఆనంద్‌కు నాటా ఫిలడెల్ఫియాలో నిర్వహించబోయే మెగా కన్వెన్షన్‌కు ఆహ‍్వానం అందింది. జూలై 6 నుంచి 8 వరకు జరగబోయే ఈ కన్వెన్షన్‌లో ప్రపంచం నలు మూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు