చిన్న చిత్రాలే సేఫ్

1 Jul, 2016 01:30 IST|Sakshi
చిన్న చిత్రాలే సేఫ్

ఈ రోజుల్లో సినిమా విడుదలై వారం ఆడడమే గగనంగా మారింది. అలాంటి థియేటర్లలో ప్రదర్శన ఒక్క వారం దాటి అది మంచి విజయం సాధించినట్లే లెక్క. అలాంటి చిత్రాలే అరుదైపోయాయని చెప్పక తప్పదు. గత వారం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం మెట్రో. ఈ చిత్రం సెలైంట్‌గా సక్సెస్ వైపు దూసుకుపోతోంది.
 
 చిన్న చిత్రంగా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోందన్న ఆనందంతో చిత్ర యూనిట్ బుధవారం పత్రికల వారితో తన సంతోషాన్ని పంచుకున్నారు. యువ దర్శకుడు ఆనంద్‌క్రిష్ణన్ స్వీయ దర్శకత్వంలో నిర్మాత జయక్రిష్ణన్‌తో కలిసి నిర్మించిన చిత్రం మెట్రో. శిరీష్, బాబీసింహా, సెండ్రాయన్, సత్య, నిశాంత్, తులసి, ప్రీతి, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జోహాన్ సంగీతాన్ని అందించారు.
 
  సెన్సార్‌తో పోరాడి చివరికి ఏ సర్టిఫికెట్‌తోనే గత వారం తెరపైకి వచ్చిన మెట్రో చిత్రం చైన్ స్నాచింగ్ ఇతివృత్తంతో చాలా సహజసిద్ధంగా తెరపై ఆవిష్కరించారు. చిత్రం మంచి ప్రజాదరణ పొందడంతో పాటు పలువురు చిత్ర ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ మెట్రో చక్కని కథనంతో రూపొందిన చిత్రం అని చిత్రం చాలా నీట్‌గా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
 అదే విధంగా దర్శకుడు శీనూరామసామి మెట్రో చిత్రం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. అందులో అన్నదమ్ములుగా నటించిన నటులిద్దరు బాగా నటించారు అని ట్విట్టర్‌లో అభినందించారు. దర్శకుడు సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ ఒక ప్రణాళిక బద్ధంగా తెరకెక్కించిన చిత్రం మెట్రో అని తెలిపారు. చిత్రాన్ని చెన్నై పరిసర ప్రాంతాల్లోనే 40 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశామని తెలిపారు.
 
 చిన్న బడ్జెట్‌లో రూపొందించిన చిత్రం మెట్రో అని తెలిపారు. తాను ఇకపై కూడా చిన్న చిత్రాలనూ తెరకెక్కిస్తానన్నారు. ఇవి అయితే ఒక వేళ చిత్రం అటూఇటూ అయినా పెద్దగా నష్టం ఉండదన్నారు. అదే భారీ చిత్రం అపజయం పాలయితే నష్టం కూడా భారీగానే ఉంటుందన్నారు. తన వరకూ చిన్న బడ్జెట్ చిత్రాలే సేఫ్ అనే అభిప్రాయాన్ని దర్శకుడు ఆనంద్‌క్రిష్ణన్ వ్యక్తం చేశారు.