ఇలాంటి సినిమాలే చేయాలని ఎప్పుడనుకోలేదు

31 May, 2020 09:12 IST|Sakshi

‘ఆషికీ–2’లో అరోషి, ‘హైదర్‌’లో అర్షియా, ‘ఏక్‌ విలన్‌’లో ఐషా, ‘సాహో’లో అమూ (అమృత నాయర్‌)... ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాలు, పాత్రలు! యంగ్‌ ఫైర్‌బ్రాండ్‌ శ్రద్ధా కపూర్‌ ఏ పాత్రలోనైనా సులభంగా ఇమిడిపోగలదు. అదే ఆమె విజయ మంత్రం. ‘సక్సెస్‌తో మాత్రమే సంతోషం రాదు’ అంటున్న శ్రద్ధా కపూర్‌ ముచ్చట్లు ఆమె మాటల్లోనే...

సంతోషం అంటే...
సినిమాల్లోకి రావడానికి ముందు, వచ్చిన తరువాత వచ్చిన మార్పు ఏమిటంటే... అప్పుడు స్వేచ్ఛగా వీధుల్లో తిరిగేదాన్ని. మార్కెట్‌కు వెళ్లేదాన్ని. ఆటోలో సిటీ మొత్తం తిరిగేదాన్ని. ఇప్పుడు రోడ్‌సైడ్‌ పానీపూరీ మిస్సవుతున్నాను... అయితే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. సినిమాల్లో నటించడం అనేది ఒక వరం. చాలామంది అనుకున్నట్లు సంతోషం సక్సెస్‌తో రాదు.  నాకు నచ్చినట్లు జీవిస్తున్నానా? నేను ఇష్టపడింది చేయగలుగుతున్నానా? అనేది మాత్రమే నా సంతోషానికి కొలమానం.

అలాంటి పాత్ర... నా కల!
‘ఇలాంటి సినిమాలు చేయాలి’ అని పెద్దగా ఎప్పుడూ అనుకోలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాను. జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని ఏర్పర్చుకున్నాను. ‘గొప్ప అవకాశం రావాలి’ అంటే రాకపోవచ్చు. ఏమీ అనుకోని రోజు మనల్ని వెదుక్కుంటూ రావచ్చు. అందుకే అంటారు జీవితం అనేది ఆశ్చర్యాల సమహారం. ఇక నాకు నచ్చిన రొమాంటిక్‌ మూవీ గురుదత్‌ ‘ప్యాసా’. ఈ సినిమాలో వహీదా రెహమాన్‌ చేసిన పాత్రలాంటిది చేయాలనేది నా కల. ‘టైటానిక్‌’, ‘ది నోట్‌బుక్‌’... సినిమాలు కూడా నా ఫేవరేట్‌ జాబితాలో ఉన్నాయి.

మరింత శక్తితో....
మా నాన్న సుపరిచిత నటుడు కాబట్టి, నేను సినిమాల్లోకి రావడం అనేది సులువుగా జరిగింది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎన్నో పాత్రల కోసం అడిషన్‌కు వెళ్లాను. అక్కడ తిరస్కారానికి గురయ్యాను. ఆ తిరస్కారాలు నన్ను నేను మెరుగుపరుచుకోడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఫెయిల్యూర్‌ అంటే మనం ఆగిపోవడం కాదు... మరింత శక్తితో ముందుకు వెళ్లడం. సినిమాల్లోకి రావడానికి ముందు హిందీ సినిమాలపై నా ఆలోచన వేరుగా ఉండేది. కెరీర్‌లో అదృష్టం పాత్రే ఎక్కువ అనుకునేదాన్ని. కాని అదృష్టం కంటే కష్టపడడం అనేది ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది.

ఆ ప్రశ్నకు సమాధానం
‘వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు మాట్లాడరు?’ అనే ప్రశ్న నాకు తరచుగా ఎదురవుతుంటుంది. అవసరమైతే తప్ప మాట్లాడకూడదనేది నేను ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. ఒక నటిగా నటనకు సంబంధించిన విషయాలను మాట్లాడితేనే మంచిది, నటనపై మాత్రమే దృష్టి పెడితేనే మంచిది అనుకుంటాను. ఇక విమర్శల గురించి వస్తే అర్థం లేని విమర్శలను పట్టించుకోను. అదే సమయంలో నిర్మాణాత్మక విమర్శను స్వాగతిస్తాను, 

మరిన్ని వార్తలు