మీటూ : సూపర్‌ స్టార్‌లపై శ్రద్ధ కామెంట్స్‌

28 Oct, 2018 10:13 IST|Sakshi

మీటూ కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమలోని మహిళల అత్యాచారాల వేధింపులకు వేదికగా మారిన విషయం తెలిసిందే. ఎన్నాళ్లగానో మనసుల్లో గూడుకట్టుకున్న వారి వేదనలను ప్రముఖ కథానాయికల నుంచి కొత్తగా ఎన్నో ఆశలతో ఈ రంగంలోకి వస్తున్న నటీమణులు బహిరంగంగా వెల్లడించి భారం దించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మొన్న గాయని చిన్మయి, నిన్న నటి శ్రుతీహరిహరన్‌ ఇలా చాలా మంది తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయట పెడుతున్నారు. అలాంటి వారికి ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. విమర్శిస్తున్న వారు లేకపోలేదనుకోండి. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కోర్టులను ఆశ్రయిస్తామంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో నటి శ్రుతీహరిహరన్‌కు సహ నటి శ్రద్ధాశ్రీనాథ్‌ మద్దతు పలికింది. అంతే కాదు మీటూ వ్యవహారం నానాటికీ ప్రకంపనలు పుట్టిస్తుంటే కథానాయకులు స్పందించరేంటని ఈ బ్యూటీ ప్రశ్నించింది. కన్నడిగురాలైన ఈ అమ్మడు కోలీవుడ్‌లో విక్రమ్‌ వేదా చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

మీటూ కలకలం సృష్టస్తున్న తరుణంలో ఈ జాణ హీరోలపై ధ్వజమెత్తింది. ఒక భేటీలో శ్రద్ధాశ్రీనాథ్‌ పేర్కొంటూ చిత్ర పరిశ్రమలో మహిళలు తాము ఎదుర్కొన్న అత్యాచారాల గురించి ధైర్యంగా బహిరంగ పరుస్తున్నారని, అయితే ఆ వ్యవహారంలో నటులు ఎక్కడున్నారు? ఏమైపోయారనేది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని అంది. 70 ఎంఎం తెరపై అక్కలను, చెల్లెళ్లను, తల్లులను కాపాడుకోవడానికి డజన్ల లెక్కలో రౌడీలను కొట్టే హీరోల ఆ మ్యాజిక్‌ను నిజ జీవితంలో చూపాలని పేర్కొంది.

ఏదో ఒకటి చెప్పాలని, ప్రముఖ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలన్నది తాను చూడాలనుకుంటున్నానంది. ఒక ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌కు చాలా సులభంగా జంప్‌ చేసే వారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి స్పందించడానికి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. నటుడు రజనీకాంత్, కమలహాసన్, అమితాబ్‌బచ్చన్‌ లాంటి కొందరు మీటూ గురించి స్పందించినా, దాని గురించి వివరంగా మాట్లాడలేదని అంది.

మీటూ గురించి ఎవరు ఎలా భావిస్తున్నారన్నది తెసుకోవాలని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పింది. ఈ మీటూ వ్యవహారం ఎప్పుడు ముగింపునకు వస్తుందని నటులు వేచి చూస్తున్నాని తమకు అనిపిస్తోందని పేర్కొంది. అయితే వారు ఈ విషయం గురించి స్పందిస్తేనే చిత్రపరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని, మహిళలు ఈ రంగంలోకి రావడానికి సౌకర్యంగా ఉంటుందని నటి శ్రద్ధాశ్రీనాథ్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు