ఆ ప్రశ్న నటులను ఎందుకు అడగరో?

10 Jul, 2020 01:13 IST|Sakshi
శ్రద్ధా శ్రీనాథ్‌

సాధారణంగా హీరోలు వివాహం తర్వాత కూడా కథకు అవసరమైతే శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటారు. పెళ్లనేది వారి అవకాశాలకు అడ్డుకాదు. అలాగే పాత్రల ఎంపిక విషయంలోనూ ఎలాంటి మార్పూ అవసరంలేదు. కానీ హీరోయిన్ల పరిస్థితి వేరు. పెళ్లయిందంటే చాలు.. అవకాశాలు తగ్గుతాయి. ఇక రొమాంటిక్‌ సీన్స్‌లో నటిస్తే ‘పెళ్లయ్యాక కూడా ఇలాంటి సీన్లు చేయడం ఏంటి?’ అని విమర్శించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. దీనిపై కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్‌ (‘జెర్సీ’ ఫేమ్‌) సోషల్‌ మీడియా వేదికగా ఓ చర్చకు తెరతీశారు. ‘పెళ్లయ్యాక హీరోయిన్‌కి నిజంగానే డిమాండ్‌ తగ్గుతుందా? మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది పది మార్కుల ప్రశ్న. దయచేసి చర్చించండి’ అంటూ పోస్ట్‌ చేశారు. అంతేకాదు..

ఆమె ఇంకా మాట్లాడుతూ –‘‘నా ఫ్రెండ్, నటి త్వరలో వివాహం చేసుకోబోతోంది. పెళ్లి తర్వాత కూడా తను నటిస్తుందా? అని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వ్యక్తి అడిగారు. అది కూడా చాలా నిర్లక్ష్యంగా. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయాను. తను అలా అడగడం నాకు కోపం తెప్పించడంతో పాటు నన్ను ఆలోచనలో పడేసింది.

వివాహం అయిన నటులు రొమాంటిక్‌ సీన్స్‌లో నటిస్తున్నారు కదా? అలాంటి ప్రశ్నలు వారిని ఎందుకు అడగరో అర్థం కాదు. ఈ విషయం గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. ఆమె పోస్ట్‌కి పలువురు ఫాలోయర్స్‌ స్పందిస్తూ –‘‘మీరు చెప్పింది కరెక్ట్‌. హీరోలకి ఒక న్యాయం.. హీరోయిన్లకి ఒక న్యాయమా? ఒక నటిని అలాంటి ప్రశ్నలు అడగడం కరెక్ట్‌ కాదు. పెళ్లయితే యాక్టింగ్‌ మానేయాలనో, ఫలానా సీన్స్‌లో నటించకూడదనో అమ్మాయిలకు ఆంక్షలు పెట్టడం సరికాదు. వారి ఇష్టానికి తగ్గ పాత్రలు చేసుకోవచ్చు’ అని  సమాధానమిచ్చారు.

సమాధానం అవుదాం – హితా
శ్రద్ధా శ్రీనాథ్‌ పోస్ట్‌కి కన్నడ నటి హితా కూడా సమాధానమిస్తూ –‘‘పెళ్లైన తర్వాత కూడా నటిస్తారా? అంటూ లెక్కలేనన్ని సార్లు నన్ను అడిగారు. నా వైవాహిక జీవితానికి, నా వృత్తికి ఎటువంటి సంబంధం లేదని నేను ఎప్పుడో చెప్పాను. నేను పెళ్లి చేసుకుంటున్నానని తెలిశాక దర్శకులు నాకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. అయితే పెళ్లి అనేది నా పనిని మాత్రం కొనసాగించకుండా ఆపలేదు. ప్రతిభను కోరుకునే వ్యక్తులు ఎలాగైనా నాలోని ప్రతిభని గుర్తిస్తారని నమ్ముతున్నాను. ఇలాంటి మూస ధోరణిని విచ్ఛిన్నం చేసి, అలాంటి అర్థం లేని ప్రశ్నలకు మనం సమాధానంగా నిలబడాలి’’ అన్నారు.  గత ఏడాది హితా వివాహం జరిగింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా