మేడమ్‌ టుస్సాడ్స్‌లో శ్రేయా ఘోషాల్‌కు చోటు

15 Mar, 2017 22:59 IST|Sakshi
మేడమ్‌ టుస్సాడ్స్‌లో శ్రేయా ఘోషాల్‌కు చోటు

న్యూఢిల్లీ: ఇండియాలో ఏర్పాటు చేస్తున్న మేడమ్‌ టుస్సాడ్‌ వ్యాక్స్‌ మ్యూజియంలో ప్రముఖ గాయకురాలు శ్రేయా ఘోషాల్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ మ్యూజియం ప్రారంభం కానుంది. దీంతో ఆలోగా మైనపు విగ్రహాన్ని సిద్ధం చేసేందుకు మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం నిర్వాహకులు అవసరమైన కొలతల్ని శ్రేయా నుంచి తీసుకున్నారు. ఈ విషయమై శ్రేయా మాట్లాడుతూ... ‘నిజంగా నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో నా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా.

సెలబ్రిటీలతోపాటు ప్రతిభావంతుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని భావించిన నిర్వాహకులు నన్ను పరిగణనలోకి తీసుకోవడం ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్, అమెరికన్‌ పాప్‌స్టార్‌ లేడీ గగా వంటి ప్రముఖుల సరసన నాకు చోటు దక్కుతోంది. ఓ రకంగా ఇది అమరత్వంతో సమానమే. ఇటువంటి గొప్ప ఆలోచన చేసిన మ్యూజియం నిర్వాహకులకు థ్యాంక్స్‌’ అంటూ పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేసింది.

తేరీ మేరీ, డోలా రె డోలా రె, దీవానీ మాస్తానీ, అగర్‌ తుమ్‌ మిల్‌ జావో, సున్‌ రహా హై, పియా ఓ రె పియా.. తదితర పాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రేయాకు ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తుందని పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు.